సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): డ్రగ్ నెట్‌వర్క్‌లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఇటీవల జరిగిన పోలీసుల దాడుల్లో సినీ నిర్మాతలు, డైరెక్టర్లు పట్టుబడుతూ వస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేయడంతో కొత్త కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. మాదాపూర్‌లోని ఫ్రెష్లైన్ అపార్టుమెంట్లో జరిగిన డ్రగ్ పార్టీ కేసుతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) భారీ డ్రగ్ నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. బెంగళూర్‌లోని నైజీరియన్లతో లింక్‌లున్న భాస్కర్ బాలాజీని పట్టుకోవడంతో సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నారెడ్డి నిర్వహించిన మాదాపూర్‌లోని డ్రగ్ పార్టీ వ్యవహారం బయటపడింది. అక్కడ ఆ ఇద్దరితో పాటు వినియోగదారుడైన రైల్వే ఉద్యోగి మురళీని కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి సెల్ఫోన్లను విశ్లేషించడంతో డ్రగ్ విక్రయించే వారితో పాటు పలువురు వినియోగదారుల వివరాలు కూడా బయటకొచ్చాయి. సీని హీరో నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు స్మార్ట్ పబ్ నిర్వాహకుడు సూర్య, టెర్ర కేఫే నిర్వాహకుడు అర్జున్, ఈవెంట్ నిర్వాహకుడు కలహార్‌రెడ్డి తదితర పేర్లు బయటకు వచ్చాయి. మరో పక్క సినీ డైరెక్టర్ సుశాంత్రెడ్డితోపాటు మరో నలుగురు వినియోగదారులను, ముగ్గురు నైజీరియన్లను గురువారం అరెస్టు చేశారు. జూన్ నెలలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన కబాలి సినిమా డైరెక్టర్ కేపీ చౌదరికి ఈ ముఠాకు ఉన్న లింక్‌లపై టీనాబ్ దృష్టి పెట్టింది. దీంతో సినీ పరిశ్రమకు సంబంధించిన మరిన్ని పేర్లు బయటకు రానున్నాయి. ఇప్పుడీ డ్రగ్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. చాలా మంది తమ సెల్ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
కోర్టుకెళ్లిన నవదీప్..
ఇదిలా ఉండగా..డ్రగ్ వినియోగదారుడైన హీరో నవదీప్ పేరు బయటకు రావడంతో..తనకు సంబంధం లేదని గురువారం ఖండించి, తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా శుక్రవారం కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు.
కోడ్ భాషలో డ్రగ్స్ సరఫరా..
డ్రగ్ దందా చేసే నైజీరియన్ సైబర్‌నేరగాళ్లు నకిలీ వీసాలు, పాస్పోర్టులతోనే బెంగళూరు, ముంబై, గోవాలో తిరుగుతూ డ్రగ్ దందా నిర్వహిస్తున్నారు. వీళ్లంతా స్నాప్‌చాట్, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్‌లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. ముంబైలో ఎండీఎంఏ డ్రగ్ కావాలంటే ‘బకరా’, బెంగళూర్‌లో కొకైన్ ‘కోక్’ పేరుతో పిలుస్తూ, కస్టమర్ల పేర్లను ‘గాడ్ హెడ్’, డాన్, డింప్ తదితర నిక్ నేమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్ అమ్మకాలు చేయాలంటే స్నాప్ చాట్‌లోనే చాటింగ్ చేసుకుంటారు. ఇందులో ఎక్కువ సమయం మెసేజ్‌లు ఉండవు. ఒకసారి చూశారంటే ఆ మెసేజ్ తిరిగి కనిపించదు. ఇదే డ్రగ్ పెడ్లర్లకు కలిసి వస్తుంది.
ఈవెంట్లు, చిత్రపరిశ్రమపై ..
ప్రధాన నగరాలలో ఉండే నైజీరియన్లతో టచ్‌లో ఉంటూ పలువురు డ్రగ్ కొనుగోళ్లు చేస్తూ హైదరాబాద్‌లో విక్రయాలు సాగిస్తున్నారు. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఉంటున్నారు. గతంలో కబాలి సినిమా డైరెక్టర్ కేపీ చౌదరి, సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నారెడ్డి అరెస్ట్ కావడంతో.. వారితో ఆయా ఫిల్డ్‌లో ఉన్న వారికి డ్రగ్ సంబంధిత లింక్‌లు బయటకు వస్తున్నాయి. డ్రగ్ వినియోగదారులుగా మారి, ఆ తరువాత డ్రగ్ పెడ్లర్స్‌గా మారడం సర్వసాధారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఈవెంట్లు, పార్టీలు నిర్వహిస్తూ అందులో డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారు. పబ్ నిర్వాహకులే ఏకంగా డ్రగ్‌కు అలవాటు పడి, ఆయా పబ్‌లలో డ్రగ్ విక్రేతలకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ టీనాబ్ దర్యాప్తులో బయటపడుతున్నాయి.
ఎవరినీ వదిలేది లేదు
రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల వాడకాన్ని అణిచివేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. దీనికి కేంద్ర సంస్థలు, ఇతర రాష్ర్టాల పోలీసులు కూడా తమతో సమన్వయం చేసుకుంటున్నారు. టీనాబ్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు, వినియోగంలో ఎవరున్నా.. ఎక్కడున్నా.. వదిలేది లేదు.. సినిమాల్లోనూ డ్రగ్‌కు సంబంధించిన సన్నివేశాలు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సినిమా డైరెక్టర్లపైనే ఉంది. టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైనా అలాంటి అభ్యంతర దృశ్యాలు పెడితే వాళ్లకు నోటీసులు ఇస్తాం. అది హలీవుడ్ అయినా తగ్గేదేలేదు. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం.
-టీనాబ్ డైరెక్టర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్