బంజారాహిల్స్, ఏప్రిల్ 27: గట్టిగా కేకలు పెట్టుకుంటూ చేతిలో కత్తితో పరుగులు పెడుతున్న ఆగంతకుడు.. అతడిని వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతంలోనుంచి కాలనీలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఎదురుగా కనిపించిన ఓ ప్రహరీగోడ మీదుగా దూకి లోనికి ప్రవేశించి అక్కడున్న వారిని కత్తితో బెదిరిస్తూ పారిపోయేందుకు యత్నం.. సినీ ఫక్కీలో సాగిన ఈ చేజింగ్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో చోటు చేసుకుంది. పట్టపగలే రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తి చేతిలోనుంచి సెల్‌ఫోన్ లాక్కోవడంతో పాటు బీర్ బాటిల్‌తో చంపేస్తానంటూ బెదిరించి డబ్బులు లాక్కుని పారిపోయిన వ్యక్తిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌కు చెందిన వినోద్‌కుమార్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హౌజ్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చిన వినోద్‌కుమార్ ఫోన్ మాట్లాడుకుంటూ తట్టిఖానా సెక్షన్ కార్యాలయం పక్కనున్న ఖాళీ స్థలం మీదుగా వెళ్తున్నాడు.
అప్పటికే అక్కడ కాపుకాసిన పాత నేరస్థుడు తులేకార్ అజయ్ అలియాస్ బబ్లూ(28).. వినోద్‌కుమార్ చేతిలోనుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరుగుపెట్టడం ప్రారంభించాడు. దీంతో అతడిని వెంబడించేందుకు యత్నించగా వెనక్కి వచ్చిన బబ్లూ అక్కడున్న బీర్ బాటిల్‌ను పగలగొట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడంతో జేబులో ఉన్న రూ.3వేలు అతడికి ఇచ్చిన వినోద్‌కుమార్ అక్కడనుంచి వచ్చి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలో దిగిన డిటెక్టివ్ ఎస్ఐ యాసిన్అలీతో పాటు ఇతర సిబ్బంది క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి రోడ్డుమీద పరిగెత్తుకుంటూ ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్లారు. ఖాళీ స్థలంలో బబ్లూను గుర్తించిన క్రైం పోలీసులు అతడి వద్దకు రాగానే చేతిలో ఉన్న కత్తితో బెదిరించి ముందుకు పరుగులు తీశారు.
దీంతో సుమారు 600 మీటర్ల దూరం పోలీసులు అతడిని వెంబడించారు. ఎమ్మెల్యే కాలనీలోకి ప్రవేశించిన బబ్లూ ఓ ఇంటి ప్రహరీగోడను ఎక్కి లోనికి దూకాడు. అక్కడున్న సిబ్బందిని కత్తితో బెదిరిస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించాడు. అప్పటికే రెండో మార్గం ద్వారా అక్కడికి చేరుకున్న క్రైం ఎస్ఐ యాసిన్ అలీతో పాటు ఇతర పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడు అజయ్ అలియాస్ బబ్లూపై గతంలో 6కేసులున్నాయని, మూడు నెలల క్రితం సైతం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఖాళీ ప్రదేశంలో బీర్ బాటిల్‌తో దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన బబ్లూ ఇటీవల బెయిల్‌మీద బయటకు వచ్చాడని గుర్తించారు. నిందితుడు బబ్లూను సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దోపిడీకి పాల్పడిన ప్రమాదకరమైన నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ క్రైం పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.