గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనుల్లో నిర్మాణం, కూల్చివేతల వ్యర్థాల (సీ అండ్ డీ వేస్ట్) నిర్వహణ నిబంధనలను కఠినతరం చేయడంపై కాంట్రాక్టర్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబరు 626 ప్రకారం క్యూర్ పరిధిలో ఇటీవల పిలిచిన టెండర్లలో పొందుపరిచిన సీ అండ్ డీ (భవన నిర్మాణ వ్యర్థాల) నిబంధనలపై కాంట్రాక్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ పనులు ప్రారంభించే ముందే గుర్తింపు పొందిన సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్ ఏజెన్సీలతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న పత్రాలను సమర్పించాలి. రీసైక్లింగ్ ప్లాంట్ నుంచి పొందిన సీ అండ్ డీ వేస్ట్ డిస్పోజల్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే కాంట్రాక్టర్ల తుది బిల్లులు మంజూరవుతాయి. సర్టిఫికెట్ లేకపోతే బిల్లులు నిలిపివేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి తోడు ప్రభుత్వ సివిల్ పనులలో కనీసం 10 శాతం రీసైకిల్ చేసిన మెటీరియల్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే 20,000 చదరపు మీటర్ల కంటే ఎకువ బిల్ట్-అప్ ప్రాంతం ఉన్న ప్రాజెక్టుల్లో శుద్ధి చేసిన సీ అండ్ డీ వ్యర్థాలను వాడటం నిబంధనగా మారింది. పనుల వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారబోయబోమని కాంట్రాక్టర్లు హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూంకుంట వద్ద 500 టీపీడీ సామర్థ్యంతో సీ అండ్ డీ ప్లాంట్ల నిర్మాణం జరగగా… గుర్తింపు పొందిన ఏజెన్సీలు సంబంధిత రుసుములు భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేపడుతున్నారు.
ఐతే టెండర్ నిబంధనల అమలులో ఎదురవుతున్న సమస్యలు, రవాణా చార్జీలు, సర్టిఫికేట్ల జారీలో జరుగుతున్న ఆలస్యం తదితర అంశాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సదరు కాంట్రాక్టర్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా.. ఫలితం లేదని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే చర్చించేందుకు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ ఆర్. హనుమంత్సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం (నేడు) మధ్యాహ్నం 2:30 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అసోసియేషన్ ఆఫీస్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ట్రై కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ భేటీకి తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే సమాచారం అందజేశారు. అయితే ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిబంధనల సవరణ చేయకపోతే భవిష్యత్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టబోమని తేల్చి చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అసోసియేషన్ నేతలు చెబుతుండడం ఆసక్తికరంగా మారింది.