హైదరాబాద్ : హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకులతో పాటు 140 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ తుపాకులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన అల్తాప్ హుస్సేన్ అనే యువకుడు ఈ ముఠా సూత్రధారి అని స్పష్టం చేశారు. హుస్సేన్ నగరంలోని ఓ ప్రయివేటు సెక్యూరిటీ సర్వీస్ సంస్థలో పని చేస్తూ, ఈ దందా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసుల్లో పని చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. నకిలీ గన్ లైసెన్స్ సర్టిఫికెట్లతో అసలైన తుపాకులను కొనుగోలు చేసి, విక్రయించేవారని పేర్కొన్నారు.