Medical Devices | ఇంట్లో పిల్లలు, వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి వంటి కీలక ఆరోగ్య సూచీలను ఎప్పటికప్పుడు గమనించడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని ప్రాథమిక వైద్య పరికరాలను ఇంట్లోనే ఉంచుకోవడం అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ పరికరాల్లో అసాధారణ రీడింగ్ కనిపించగానే భయపడకుండా, ప్రశాంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ థర్మామీటర్, బీపీ మానిటర్, పల్స్ ఆక్సీమీటర్, అవసరమైతే గ్లూకోమీటర్, నెబ్యులైజర్, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఇంట్లో ఉండటం మంచిది. ఇవి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు తగ్గించి, వైద్యులకు సరైన సమాచారం అందించడంలో కూడా ఈ పరికరాలు ఉపయోగపడతాయి.
అయితే ఏదైనా పరికరంలో అసాధారణ రీడింగ్ కనిపించిన వెంటనే అది తీవ్రమైన సమస్య అని భావించకూడదు. మొదట కనిపించిన రీడింగ్‌ను ఒక హెచ్చరికగా మాత్రమే పరిగణించి, మరోసారి సరిచూసుకోవడం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు పరికరాన్ని సరిగా ఉపయోగించకపోవడం లేదా ఇతర కారణాల వల్ల కూడా తప్పుడు రీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా లేదా చాలా తక్కువగా కనిపిస్తే ముందుగా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్లీ బీపీని పరీక్షించాలి. డైనింగ్ కుర్చీలో నిటారుగా కూర్చొని, చేతిని టేబుల్‌పై సపోర్ట్ ఇచ్చి కొలిస్తే సరైన ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన, నొప్పి, ఇటీవల చేసిన శారీరక శ్రమ, బీపీ కఫ్‌ను సరిగా ధరించకపోవడం వంటి కారణాల వల్ల కూడా రీడింగ్ మారుతుంది. అలాగే బీపీ కొలిచే ముందు కనీసం గంటపాటు టీ, కాఫీ తాగకుండా ఉండాలి. దగ్గు మందులు, ముక్కు దిబ్బడ తగ్గించే మందులు లేదా నెబ్యులైజేషన్ వాడిన తర్వాత కూడా బీపీ, పల్స్ తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంటుంది.
గ్లూకోమీటర్‌లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా ఎక్కువగా లేదా తక్కువగా కనిపిస్తే ముందుగా చేతులను శుభ్రంగా కడిగి మళ్లీ పరీక్షించాలి. వేళ్లపై ఆహార అవశేషాలు లేదా శానిటైజర్, స్పిరిట్ అవశేషాలు ఉండటం వల్ల కూడా తప్పు రీడింగ్ వస్తుంది. చెమటలు పట్టడం, తల తిరగడం, అయోమయం, తీవ్రమైన దాహం వంటి లక్షణాలు కూడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరో వేలితో మళ్లీ పరీక్షించడం లేదా సాధ్యమైతే మరో గ్లూకోమీటర్‌తో పోల్చి చూడడం కూడా మంచిది. థర్మామీటర్లో అధిక జ్వరం నమోదైతే ముందుగా ఉష్ణోగ్రతను సరిగ్గా కొలిచామా లేదా అని నిర్ధారించుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి. జ్వరం ఎక్కువసేపు కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అయోమయం లేదా ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి.
పల్స్ ఆక్సీమీటర్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా కనిపిస్తే చేతులను వెచ్చగా ఉంచి, కదలకుండా కొద్దిసేపు ఉండి మళ్లీ పరీక్షించాలి. చల్లని వేళ్లు, రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా పరికరాన్ని సరిగ్గా అమర్చకపోవడం వల్ల కూడా తక్కువ రీడింగ్ వస్తుంది. మళ్లీ పరీక్షించిన తర్వాత కూడా ఆక్సిజన్ స్థాయి తక్కువగానే ఉండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఆరోగ్య పరికరాలు చూపించే సంఖ్యలు ఉపయోగకరమైన సూచనలు మాత్రమే. వాటితోపాటు శరీరంలో కనిపించే లక్షణాలను కూడా తప్పనిసరిగా గమనించాలి. అసాధారణ రీడింగ్ కనిపించినప్పుడు భయపడకుండా మరోసారి పరీక్షించి, అవసరమైతే వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.