Omicron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన థర్డ్ వేవ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంతే వేగంగా తగ్గిపోయింది. మొదటి రెండు వేవ్‌లతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించినా.. ప్రాణహాని మాత్రం జరగలేదు. పైగా జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలతోనే ఈ వేరియంట్ తగ్గిపోయింది. దీంతో ఒమిక్రాన్‌ను చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే పెద్దల సంగతి ఎలా ఉన్నా.. చిన్న పిల్లలపై మాత్రం ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.
కరోనా వైరస్ సోకిన చిన్నారుల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. తమ పరిశోధనలో భాగంగా వారు SARS-COV2తో ఆస్పత్రి పాలైన 18,849 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ (యూఏఐ) కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కొవిడ్ కారణంగా హాస్పిటల్లో చేరిన 21.1 శాతం పిల్లల్లో అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ తీవ్రంగా కనిపించినట్లు తెలిసింది. అలా తీవ్రమైన యూఏఐతో బాధపడ్డ పిల్లలకు శ్వాస అందించడం కోసం ఊపిరితిత్తులకు ట్యూబ్‌లు ఎక్కించినట్లు పేర్కొంది. అంతేకాదు ఒమిక్రాన్ వేరియంట్ రావడానికి ముందు.. తర్వాత డేటాను విశ్లేషించినప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత యూఏఐ బారిన పడే సగటు పిల్లల వయస్సు నాలుగేండ్ల ఐదు నెలల నుంచి రెండేండ్ల ఒక నెలకు పడిపోయింది. ఈ మేరకు జామా పిడియాట్రిక్స్ జర్నల్‌లో తాజాగా ఒక అధ్యయనం ప్రచురితమైంది.
మొదటి రెండు వేవ్‌లో కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులకు చేరిపోయింది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. అయితే ముందు వేరియంట్లతో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఒమిక్రాన్ సోకిన వారిలో జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలే ఎక్కువగా కనిపించాయి. ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావమే చూపించింది. వైరస్ రిప్లికేషన్ తక్కువగా ఉండటం వల్లనే ఇది ఊపిరితిత్తుల మీద కాకుండా కేవలం శ్వాస మార్గాలపై ఇది ప్రభావం చూపించింది. ఇదే ఇప్పుడు పిల్లల్లో అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణమైంది.
అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా పిల్లల్లో కనిపించేదే. ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు యూఏఐ సమస్య వస్తుంది. ఆ సమయంలో దగ్గు, జ్వరం, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడటం, అలసట, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒమిక్రాన్ సోకిన సమయంలో ఇమ్యూనిటీ చాలావరకు దెబ్బతింటుంది. కాబట్టి ఒమిక్రాన్ సోకిన వారిలో యూఏఐ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. పైగా యూఏఐ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాసనాళాలు ఆకస్మాత్తుగా మూసుకుపోతాయని, దాని వల్ల గుండెకు శ్వాస అందకపోవచ్చని పరిశోధకులు తెలిపారు. దానివల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఉందని హెచ్చరించారు.