Kokum Vs Amla | వేసవి వేడి ఎక్కువగా పెరుగుతున్న సమయంలో ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శరీరాన్ని చల్లబరిచే పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వేసవిలో బయట మార్కెట్ లో లభించే శీతల పానీయాలకు బదులుగా సంప్రదాయ జ్యూస్ లను తీసుకోవడం మంచిది. వేసవిలో తీసుకోదగిన సహజ పానీయాల్లో కోకుమ్ జ్యూస్, ఉసిరి జ్యూస్ లు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు. ప్రజలు కూడా వేసవిలో కోకుమ్ జ్యూస్, ఆమ్లా జ్యూస్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంప్రదాయ సూపర్ఫుడ్స్తో తయారయ్యే ఈ జ్యూసులు శరీరానికి లోపల నుంచి చల్లదనం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కోకుమ్ పండ్లు, మొత్తం ఉసిరి కాయలు పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి.
అయితే ప్రస్తుతం మార్కెట్లో సిరప్స్, పౌడర్ రూపంలో లభిస్తున్న జ్యూసులతో పోలిస్తే తాజా కోల్డ్-ప్రెస్డ్ జ్యూస్ లను తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. రెడీమేడ్ జ్యూసుల్లో కృత్రిమ రంగులు, రుచులు, రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను తగ్గించవచ్చని కనుక తాజా జ్యూస్ లనే తీసుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అసలు వేసవిలో జ్యూస్ లను ఎందుకు తీసుకోవాలి.. కోకుమ్, ఉసిరి జ్యూస్ లలో ఏది శరీరానికి మేలు చేస్తుంది.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. అందుకే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఈ సమయంలో కోకుమ్ లేదా ఆమ్లా జ్యూస్ వంటి పానీయాలను తీసుకోవడం వల్ల శరీరానికి నీరు అందుతుంది. అవసరమైన పోషకాలు లభిస్తాయి. శరీరం లోపల నుంచి చల్లగా ఉంటుంది.
ఇక కోకుమ్ జ్యూస్ ను కోకుమ్ పండుతో తయారు చేస్తారు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దీనిలో ఆంథోసైనిన్లు వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులో గార్సినాల్ కూడా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే దీనిలో హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ వంటి ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడతాయి. అలాగే కొద్ది మొత్తంలో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. కోకుమ్ జ్యూస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో వచ్చే అలసటను తగ్గిస్తుంది.
ఉసిరి జ్యూస్ కూడా పోషకాలను కలిగి ఉంటుంది. మార్కెట్లో లభించే ప్యాక్డ్ జ్యూసుల్లో ఆమ్లా శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి లేబుల్ చూసి తీసుకోవడం మంచిది. తాజా ఆమ్లా జ్యూస్లో విటమిన్ సి 600-700 mg వరకు ఉంటుంది. అలాగే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ బలమైన యాంటీ ఆక్సిడెంట్ చర్యను అందిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ జ్యూస్ లో ఉండే అమినో యాసిడ్లు శరీర జీవక్రియకు మద్దతును ఇస్తాయి. ఉసిరి జ్యూస్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మద్దతును ఇస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక రోజూ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఉసిరి జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి శక్తినిస్తుంది.
కోకుమ్ జ్యూస్, ఉసిరి జ్యూస్ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కోకుమ్ జ్యూస్ శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీరా, ఉప్పు కలిపి ఈ జ్యూస్ ను తీసుకోవడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా ఆమ్లా జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కోకుమ్ జ్యూస్ శరీరాన్ని చల్లగా ఉంచడంలో కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆమ్లా జ్యూస్ మొత్తం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండు జ్యూసులు కూడా ఆరోగ్యానికి మంచివే. ఏ జ్యూస్ తీసుకోవాలన్నది సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.