కన్ఫ్యూజన్ వద్దు!
ఇది ఎన్నికల కాలం! ఇంకేం తెల్లారకముందే వినపడుతున్న మైకుల శబ్దాల్లో తమ నాయకుల గొప్పతనాన్ని, ప్రతినాయకులపై దూషణను వింటూనే నిద్ర లేస్తున్నాం! ఎక్కడా ప్రజల సమస్యల పరిష్కారాల వాగ్దానాలు వినపడుతున్నట్టు లేదు.
ఇది ఎన్నికల కాలం! ఇంకేం తెల్లారకముందే వినపడుతున్న మైకుల శబ్దాల్లో తమ నాయకుల గొప్పతనాన్ని, ప్రతినాయకులపై దూషణను వింటూనే నిద్ర లేస్తున్నాం! ఎక్కడా ప్రజల సమస్యల పరిష్కారాల వాగ్దానాలు వినపడుతున్నట్టు లేదు. ఒక కుటుంబసభ్యులే రాజకీయ మనుగడ కోసం తలా ఒక పార్టీలో తరిస్తూ వారి గురించి మనకు తెలియనట్టు వివరిస్తున్నప్పుడు పొద్దున్నే ఇడ్లీ తినాలా, అట్టు తినాలా అన్నట్టు ఏదో అయోమయం.
ఈ వర్తమానంలో ఒక పార్టీ తరపున మాటలు, పాటలు పాడి, అరచి చించుకుంటున్న గొంతుక నిన్నేదో వేరే పార్టీ నాయకుడిని పొగిడినట్టు గుర్తొస్తున్నది. బట్టలూడదీయడాలు, ఊరేగించడాలు, దుష్ట చతుష్టయాలు, బంగాళాఖాతాలు, పాతాళలోకాలు, క్లాస్ వార్లు, కోల్డ్ వార్లు, ఇంకా ఈ జనరేషన్‌కు పరిచయం లేని ఎన్నో కొత్త పదాలతో తెలుగు భాష కొత్త రూపాన్ని చూసి టిఫిన్ తర్వాత కాఫీనా, టీనా ఏది తాగాలో తికమకగా ఉన్నది.
ప్రజలకు మాత్రం ఇది ఎన్నికల కాలం, ప్రజల చైతన్యానికి ఒక పరీక్షా కాలం. కానీ రాజకీయ నాయకులకు ఇది ఎన్నో కలల కాలం! కన్న కల వర్తమానంలో నెరవేరని నాయకుడి భవిష్యత్తు కార్యాచరణ కార్యకర్తలకు సంబంధం లేని విధంగా నాలుక మూడు మడతల్లోంచి మూడు శబ్దాలతో, మూడు కొత్త వాగ్దానాలు రావచ్చు. మూడు నాలుగు పార్టీల కూటమితో ముచ్చటగా పొత్తులు కుదురుకోవచ్చు. మూడు పార్టీల జెండాలను మీటింగుల్లో అటూఇటూ ఊపుకుంటూ భుజాన మోస్తూ, కలగాపులగమైన రంగుల, హంగుల నినాదాలతో మనల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు. రాష్ట్ర ప్రజల బాగుకోసం రవ్వంత రంగు మారిందని బుకాయించవచ్చు.
ముందు పదవి అనుభవించిన కాలంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల మ్యానిఫెస్టో అంటూ ఒకటున్నదని గుర్తులేకపోతే మళ్లీ ‘ఆకాశం దించాలా, నెలవంకా తుంచాలా, శిగలో ఉంచాలా?’ అని ప్రేమికులను అడిగినట్టుగా అడిగి తమ పార్టీల పటిష్టతను, సమైక్యతను, ప్రజాస్వామ్య విలువలను గురించి ధనస్వామ్యంలో ఉద్భవించిన రంగుల కలువల పరిమళం మన ముక్కుపుటాలకు చేరినప్పుడు, కడుపునిండిపోయిన ఫీలింగ్‌తో భోజనం అవసరం కూడా లేకపోవచ్చు.
ప్రతి పది నిమిషాలకోసారి టీవీల్లో వస్తున్న రాజకీయ ప్రకటనల్లో మునిగి మీ ఉనికి మీరు మరచిపోవచ్చు. ఇదిలా ఉంటే ఈ పాత్రలన్నీ బయోపిక్‌ల రూపంలో సినిమాల్లో జొరబడి ఎవరికో నచ్చిన, నచ్చని కథ సినిమాగా రావడం, దాని గురించి కోర్టులు, మనం కూడా కన్ఫ్యూజన్లో పడటం జరుగుతున్నది. ప్రతిపక్షంలో అపరిచితుడైన నాయకుడు ప్రభుత్వంలోకి వస్తే ఏమీ తెలియని అమాయకుడైన ‘రామం’గా మారవచ్చు.
గుడిలో విబూది నామాలు, బరిలో రాజకీయ పాఠాలు, చర్చిలో ప్రార్థనలు, మసీదుల్లో నమాజ్‌లు, రైతు ఉద్యమాల్లో తలపాగాలు, ఇవన్నీ తమ వ్యక్తిగత నటనా చాతుర్యాలని, అధికారపు ఆకాంక్షలని ప్రజలు గుర్తించలేరనే వారి భావనలో బలం ఉండవచ్చు. వీటన్నింటితో పని లేకుండా పాటల డీజే స్పీకర్ల గర్జింపులు, పాదయాత్రలతో పలకరింపులు, ఇవన్నీ మీ గుమ్మం గడప తొక్కి ఓటు కోసం మీ క్షేమాలు విచారిస్తునప్పుడు పొంగిపోకుండా, మీ మనసులో ఉన్న నాయకుల కోసం కుంగిపోకుండా, రాష్ట్ర సంక్షేమం విషయాన్ని కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుచేయండి. మీ ఆలోచనలకు తగ్గ నాయకునికి, మీరు గుర్తించగలిగిన వానికి పార్టీతో పని లేకుండా తప్పక ఓటు వేయండి. మనకెందుకులే అనుకుంటూ మనం నిద్ర నటిస్తే… గుక్కెడు నీళ్ల కోసం, పట్టెడన్నం కోసం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వాల కోసం పడిగాపులు కాసే వాళ్లెంతోమంది శాశ్వత నిద్రలోకి జారుకుంటారు.
– జోస్యుల వేణుగోపాల్ 94404 36806
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

