కేసీఆర్ స్వర్ణయుగాన్ని పదేపదే తలుస్తున్నరు
అన్నదాతకు అందని భరోసా..కాళేశ్వరంపై కక్షతో సాగునీటి సంక్షోభం బాండ్ పేపర్ల సాక్షిగా దగా..దాదాపు మూడేండ్లు కావస్తున్నా పట్టాలెక్కని ఆరు గ్యారెంటీలు. మళ్లీ మొదలైన కరెంట్ కోతలు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్, హైదరాబాద్ బ్రాండ్, జాబ్ క్యాలెండర్‌తో యువతకు నిరాశ.
అన్నదాతకు అందని భరోసా..కాళేశ్వరంపై కక్షతో సాగునీటి సంక్షోభం బాండ్ పేపర్ల సాక్షిగా దగా..దాదాపు మూడేండ్లు కావస్తున్నా పట్టాలెక్కని ఆరు గ్యారెంటీలు. మళ్లీ మొదలైన కరెంట్ కోతలు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్, హైదరాబాద్ బ్రాండ్, జాబ్ క్యాలెండర్‌తో యువతకు నిరాశ. ఈ నేపథ్యంలో మళ్లీ కేసీఆర్ స్వర్ణ యుగాన్ని తలచుకుంటున్న తెలంగాణ జనం. బీఆర్ఎస్ పాలనే కావాలంటున్న ప్రజలు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని తొమ్మిదిన్నరేండ్ల కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఒకప్పుడు కరెంట్ కోతలు, సాగునీటి కష్టాలు, ఆకలి చావులు, వలసలతో అల్లాడిన తెలంగాణ ప్రాంతాన్ని దేశానికే ధాన్యాగారంగా, ఐటీ రంగంలో అగ్రగామిగా మార్చిన చరిత్ర కేసీఆర్ సొంతం.
అయితే ‘మార్పు’ అనే నినాదంతో, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ పాత రోజుల్లోకి జారుకుంటున్నదనే ఆందోళన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. కేసీఆర్ నాటి తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానానికి, ప్రస్తుత అస్తవ్యస్త పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతిఒక్కరూ ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకున్నది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు, సకాలంలో రైతుబంధు పెట్టుబడి సాయం అందించడంతో కరోనా విపత్తు సమయంలోనూ కొత్త రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఇప్పుడు ఇందుకు భిన్నంగా, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టకుండా, కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా గోదావరి జలాలను వృథాగా సముద్రంలోకి వదిలేయడంతో సాగునీటి కొరత ఏర్పడింది.
శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో పాటు, నీరు ఇవ్వలేమంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులే స్వయంగా రైతులను పంటలు వేయవద్దని చెప్పడం ప్రభుత్వ ముందుచూపు లేమికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన సంక్షోభమే. మరోవైపు ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు కాంగ్రెస్ పాలన మూడేండ్లు పూర్తికావస్తున్నా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు.
కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అందిన రైతుబంధు, దళితబంధు, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ వంటి పథకాలు నేడు నిలిచిపోయాయి. సంపూర్ణ రుణమాఫీలో కొర్రీలు, పెంచిన పింఛన్ల అమల్లో జాప్యం, రేషన్ డీలర్లకు బకాయిలు చెల్లించకపోవడం వంటి అంశాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. పాలనపై పట్టు సాధించలేక, కేవలం గత ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలకులు వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు పట్టణ ప్రగతిలోనూ ఇదే తరహా తిరోగమనం కనిపిస్తున్నది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ అప్రకటిత విద్యుత్తు కోతలు మొదలవడం పారిశ్రామిక, గృహరంగాలను కుదేలుచేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ చొరవతో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎన్నో హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. టీ-హబ్, టీఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, రియల్ ఎస్టేట్, ఉపాధి కల్పన ఉరకలెత్తాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, స్థిరత్వం లేని విధానాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి, పెట్టుబడిదారుల్లో తీవ్ర అభద్రతాభావం నెలకొన్నది. యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది.
కేసీఆర్ హయాంలో పోలీస్, గురుకులం, గ్రూప్స్ ద్వారా లక్షలాది ఉద్యోగాల భర్తీ జరిగితే, నేడు జాబ్ క్యాలెండర్ అమల్లో జాప్యం, నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగాల్సిన దుస్థితి దాపురించింది. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గొంతు విప్పుతుంటే, అసెంబ్లీ వేదికగా అరెస్టులు చేయడం, కొత్త చట్టాల పేరిట ప్రశ్నించే గొంతుకలను, మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పాలన అంటే కేవలం రాజకీయ విమర్శలు, కక్షసాధింపు చర్యలు కాదని కాంగ్రెస్ పాలన నిరూపిస్తున్నది.
సంక్షోభ సమయాల్లోనూ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించిన కేసీఆర్ దార్శనికతకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు మధ్య ఉన్న తేడాను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ హయాం నాటి సుస్థిర, సంక్షేమ పాలనను కోరుకుంటున్నారు. తెలంగాణ ఇంటి పార్టీగా, రాష్ట్ర ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ మాత్రమే రాష్ర్టాన్ని మళ్లీ అభివృద్ధిని పట్టాలెక్కించగలదనే నమ్మకం ప్రజల్లో రోజురోజుకూ బలపడుతున్నది.
అచ్యుత్‌రెడ్డి రేకులపల్లి
90101 19919
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

