రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై, రాహుల్ గాంధీ నాయకత్వంపై పార్టీ అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ నమ్మకం పోతున్నది. ఆయన పోరాట సామర్థ్యంపై విశ్వాసం ఉండడం లేదు. రాహుల్ ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడిన తీరు ఈ విషయం స్పష్టం చేస్తున్నది. కొన్ని నెలల క్రితం ఒక రాజ్యాంగ పదవికి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో తనకూ, కేంద్ర సర్కార్‌ను నడిపే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి రాహుల్ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారు.
‘జాతీయ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే గెలిచేది మీ కాంగ్రెసే కదా! అయినా మీరు మా సర్కార్‌తో ఎందుకు తగవు పడుతున్నారు?’ అని బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ తనను ప్రశ్నించారని గాంధీ కుటుంబ వారసుడు వెల్లడించారు. ‘ఇప్పుడైనా కొందరు కాంగ్రెస్ నేతలు నా నాయకత్వ పటిమపై నమ్మకం పెంచుకోవడం మంచిది. వారు నా అభిప్రాయాలను విశ్వసించడం లేదు. ఇకనైనా నన్ను నమ్మడం మొదలుబెడితే పార్టీకి శ్రేయస్కరం’ అని బేలగా మాట్లాడారు.
బీజేపీ పరాజయం పొందితే గెలిచేది కాంగ్రెసేనని కాషాయపక్ష అగ్రనేతలే నమ్ముతుంటే, సీఈసీకీ, మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా తన ‘ఓట్ చోరీ’ ఆందోళన విషయంలో కాంగ్రెస్ పెద్దలే కొందరు తనపై నమ్మకంతో లేరని రాహుల్ తన పార్టీ కీలక సమావేశంలో వాపోవడం విశేషం. ‘ఓట్ చోరీ’ రాజకీయ పోరులో కాంగ్రెస్ యావత్తూ తన వెనుక లేదన్న రాహుల్ వ్యాఖ్యతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విభేదిస్తూ నాయకులు, కార్యకర్తలందరూ రాహుల్ వెంటే నడుస్తున్నారని సీడబ్ల్యూసీ భేటీలో ధైర్యం నూరిపోశారు. ‘హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వంటి జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో ఈ విషయాలు వార్తలుగా ప్రచురించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధూ, వివేక్ జోషి విభేదించారనే వార్తతో మోదీషా ద్వయం, సీఈసీ పరువు పలుచబడిన తర్వాత కూడా ప్రధాని పదవికి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌కి అనుకున్నంత బలం చేకూరడం లేదు.
వరుసగా రెండుసార్లు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో గుర్తింపు పొందే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2014లో 44, 2019లో 52 సీట్లు మాత్రమే ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీకి 99 స్థానాలు దక్కాయి. దాంతోపాటే రాహుల్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పదేండ్ల పోరాటం తర్వాత లభించింది. ఎల్వోపీగా గుర్తింపు పొందాక ఆయన దూకుడు పెరిగింది. కానీ తర్వాత జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు తప్పలేదు. దీంతో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా ఉండి గట్టి పోటీ ఇచ్చిన హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో బీజేపీ ఓట్ చోరీతోనే గెలిచిందనే వాదనను రాహుల్ గత రెండేండ్లుగా బ్రేక్ లేకుండా మీడియా సమావేశాల్లో వినిపిస్తున్నారు.
రాహుల్ గాంధీ పట్టుకున్న ఏకైక నినాదం ఓట్ చోరీ ఒక్కటే కాంగ్రెస్‌ను ఈసారి గట్టెక్కించలేదని ఆ పార్టీలోని అత్యధిక నేతలు, కార్యకర్తలకు తెలుసు. రాహుల్ మాత్రం తన ‘ఒంటరి నోటి పోరాటం’ వల్లే మోదీషా సర్కార్‌కు ఇప్పుడు చెమటలు పడుతున్నాయని, ఇందుకు రాజకీయ, ఎన్నికల లబ్ధి మొత్తం తనకు, కాంగ్రెస్‌కే దక్కాలని ఆశిస్తున్నారు. మొన్నటి సీడబ్ల్యూసీ భేటీలో, ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు ఈ విషయాన్నే నిరూపిస్తున్నాయి. వివిధ రాష్ర్టాల ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది నిజమైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ ఎప్పటి మాదిరిగానే వైట్ స్క్రీన్ గణాంకాలతో ఢిల్లీ ఇందిరాభవన్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో అనర్గళంగా ప్రసంగించారు. ఓటర్ల జాబితాల నుంచి బీజేపీకి అనుకూలంకాని వర్గాల ఓట్లు తొలగిస్తున్నారని ఆయన అదేదో కొత్త వాస్తవంగా వెల్లడించారు.
ఈ క్రమంలో ఆవేశంతో ప్రసంగిస్తూ, ‘2014 నుంచి గుజరాత్లో జరిగిన ఎన్నికలన్నీ రిగ్గింగ్, ఇతర అక్రమాల ద్వారా బీజేపీ గెలిచినవే. దేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ ద్వారా గెలిచింది’ అని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా గెలుపునకు ప్రయత్నించిందని చెప్పడంలో తప్పులేదు. అందులో వాస్తవం ఉన్నది. గతంలో కాంగ్రెస్ అనేకచోట్ల చేసిన పని ఇదే. అయితే, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో ఎప్పుడెప్పుడు, ఏఏ పద్ధతుల ద్వారా రిగ్గింగ్‌కు పాల్పడిందీ రాహుల్ వివరాలతో వెల్లడించలేదు. అన్ని రాష్ర్టాల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పడానికి ఆయన తగిన ఆధారాలు సహా చెప్పలేదు. అలాగే, 2014 నుంచి జరిగిన కేరళం, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్ ఎన్నికల్లో వివిధ సందర్భాల్లో బీజేపీయేతర పక్షాలైన సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్, భారత రాష్ట్ర సమితి, మహాగఠ్‌బంధన్ కూటమి గెలిచాయి. కాంగ్రెస్ సైతం కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. మరి రాహుల్ ప్రకటన ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా అయోమయ పరిస్థితికి కారణమవుతున్నది. రాహుల్, ఖర్గే వంటి కాంగ్రెస్ బడా నేతల ఇలాంటి గందరగోళ ప్రకటనలు, పొంతన లేని మాటలు బీజేపీకి పరోక్షంగా బలాన్ని ఇస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని హిందూ మతోన్మాద శక్తులపై పోరాటాన్ని పలుచన చేస్తున్నాయి.
రాహుల్ దారిలోనే ఖర్గే పయనిస్తున్నారని ఈమధ్య ఆయన తన సొంతూరు కలబురిగిలో చేసిన రాజకీయ ప్రకటన చెప్తున్నది. లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ర్టాల అసెంబ్లీలను రద్దు చేయాలని, ఈ ఎన్నికలన్నీ చట్టవ్యతిరేకంగా జరిగినవి కాబట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఖర్గే కిందటి శనివారం ఒక సమావేశంలో కోరారు. తాజాగా అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో జరిపించాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం. అన్ని ఎన్నికలూ అక్రమాలు, రిగ్గింగ్ ద్వారా జరిగాయని చెప్తూ, తాజా ఎన్నికలు జరుపాలని కోరడం సబబే. మరి ఈ ప్రక్రియ చట్టబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎలా చేపట్టాలో ఆయన చెప్పలేదు. ‘నేడు చట్టవ్యతిరేకంగా జరిపించిన ఎన్నికల ద్వారా దేశాన్ని నడిపిస్తున్నారు. మోదీ చట్టవ్యతిరేక ప్రధాని. అమిత్ షా చట్టవ్యతిరేక మంత్రి. అన్ని రాష్ర్టాల్లో ఎన్నికైన ముఖ్యమంత్రులందరూ చట్టవ్యతిరేకంగా వచ్చినవారే’ అంటూ ఖర్గే చెప్పిన తీరు ఎన్నికల ప్రచారంలో, వీధి ప్రచారాల్లో కొంతవరకు పనికిరావచ్చు. అంతేగానీ మోదీ, షా ద్వయం నాయకత్వంలో సాగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు ముగింపు పలుకడానికి ఉపయోగపడదు.
ఇటీవల రాహుల్ మరో అడుగు ముందుకేసి ‘2024 వేసవి ఎన్నికల ద్వారా ఉనికిలోకి వచ్చిన లోక్‌సభ పూర్తిగా చట్టవ్యతిరేకం. పూర్తిగా రిగ్గింగ్ ద్వారా సభ్యులందరూ ఎన్నికయ్యారు. కాబట్టి వారు చేసిన చట్టాలు చెల్లవు’ అంటూ నోరు చించుకుంటూ దూకుడు పెంచారు. ‘సర్’ విషయంలో ప్రతిపక్షాలకు మోదీ సర్కార్‌పై ప్రయోగించడానికి వచ్చిన రాజకీయ అస్ర్తాలు కాంగ్రెస్ అనాలోచిత ప్రకటన వల్ల పనికి రాకుండా పోయే పరిస్థితి ఎదురవుతున్నది. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించే బీజేపీ అగ్రనేతల పద్ధతులనే రాహుల్, ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలు గుడ్డిగా అనుసరిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్మాణాత్మక రాజకీయ పోరాటం చేసే శక్తిని కాంగ్రెస్ కోల్పోయిందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ర్టాల ఎన్నికల్లో మిత్రపక్షాలను బలోపేతం చేసే చర్యలు తీసుకోకుండా వాటిని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నది. అక్కడి కాంగ్రెస్ స్థానిక నేతల ప్రకటనలు చదివితే రాహుల్, ఖర్గేల దారిలోనే వారు పయనిస్తున్నారని అర్థమవుతున్నది. అన్నిటికీ మించి ‘ఓట్ చోరీ’ పోరాటం తన సొంత ప్రయోగమని భ్రమిస్తున్న రాహుల్ గాంధీకి పార్టీలో పెద్ద నేతల సహకారం లేదనే దిగులు పట్టుకున్నది. ‘సర్’, ఓట్ చోరీ వంటి కీలక విషయాలపై గందరగోళ ప్రకటనలతో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రత్యక్షంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే అనుమానం దేశ పౌరులకు వస్తున్నది.