మంత్రగాళ్లు కనికట్టు చేస్తున్నారు
ఎగబాకుతున్న గ్యాస్ ధర
హఠాత్తుగా శీర్షాసనం వేసింది
మోసపోవడం మీకు షరా మామూలు అయితే
కచ్చితంగా అది రాఖీ కానుకే
తంత్రగాళ్లు తమాషాలు చేస్తున్నారు
బాదుతున్న కొరడా హఠాత్తుగా
మఖమల్ పూత పూస్తున్నది
మత్తులోకి పోవడం మీ చిత్తం అయితే
పండగ..పండగ మీకు కానుకల హుండీలే
అధికార వ్యాపారులు ప్రేమ కురిపిస్తున్నారు
ఓట్ల తేనెతుట్టెను
తాయిలాల రాళ్లతో కొడుతున్నారు
ధర్మం గొంగడి కప్పుకొన్న
లీడర్ వేటగాళ్ల పని పట్టగలవా
ఓటరు తేనెటీగలు!
హృదయంలోని నిజాయితీకి
తీపి పలుకుల నాలుకకు
బంధం ఎన్నడో తెగిపోయింది
మనసులోని సత్యానికి
పెదవిలోని చిరునవ్వుకు
రుణమెన్నడో తీరిపోయింది
ప్రజాస్వామ్య చెరువులో
ప్రజలెప్పుడూ చేపలే
నాయకులు వేసే
ఆపదమొక్కుల ఎరలకు
చిక్కినావా…
యావజ్జీవం చిక్కులే…