బంజారాహిల్స్: అగ్గిపెట్టె ఉందా..అంటూ ప్రశ్నించిన ఓ యువకుడికి లేదని చెప్పడమే నేరమన్నట్లు దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విభాగంలో పనిచేసే శివ అనే యువకుడు రహమత్‌నగర్ సమీపంలోని వీడియో గల్లీలో మూడునెలలుగా నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 5న రాత్రి 11.30 ప్రాంతంలో శివ తన స్నేహితుడు నాగార్జునతో కలిసి ఇంటిముందు కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు. అదే సమయంలో రఫీక్ షేక్ (19) అనే యువకుడు అక్కడకు వచ్చాడు. అగ్గిపెట్టె ఉందా అంటూ నాగార్జునను అడిగాడు. తనవద్ద అగ్గిపెట్టె లేదంటూ నాగార్జున సమాధానం ఇచ్చి మొబైల్ గేమ్స్‌లో మునిగిపోయాడు.
దాంతో తన మాటను విని పట్టించుకోవడం లేదని ఆగ్రహానికి గురయిన రఫీక్ దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాసేపటికి గొడవ ఎందుకని భావించిన శివ మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లబోయాడు. దాంతో వెనకనుంచి వచ్చిన రఫీక్ అతడి కాళ్లు పట్టుకుని వెనక్కి లాగడంతో కిందపడిపోయాడు.
దీంతో శివ మోకాలు ఫాక్చర్ అయింది. ఈ మేరకు బాధితుడు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు రఫీక్ షేక్ మీద ఐపీసీ 341,324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.