తిరుమల : తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams ) భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సోమవారం స్నపన తిరుమంజనం ( Snapana Tirumanjanam ) భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.


తెల్ల ముత్యాలు ( White Pearls ) , వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛా రణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, అధికారులు పాల్గొన్నారు.