భాగవతం ద్వితీయ స్కంధంలో బ్రహ్మ-నారద సంభాషణ రూపంగా నిక్షిప్తమై ఉన్న సంక్షిప్త ‘భగవల్లీలావతార కథనం’లో అమాత్యుడు పోతన ‘పృథువు’ అవతార పరమార్థాన్ని అల్పాక్షర రమణీయంగా, అనల్ప భావ పరిమళ భరితంగా ఈ ఉత్పలమాలలో గుబాళింపజేశాడు.
ఉ॥ వేనుడు విప్రభాషణ పవి ప్రహతి చ్యుత భాగ్య పౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మతనూభవుడై పృథుండు నాఁ
బూని జనించి తజ్జనకు బున్నరకంబును బాపె, మేదినిన్
ధేనువు జేసి వస్తు వితతిం బిదికెన్ హరి సత్కళాంశుడై
బ్రహ్మ నారదునితో- పుత్రా! ‘వేను’డనే దుష్ట భూపాలుడు పరాకాష్ఠను పొందిన తన పాప కారణంగా శిష్టులైన భూసురు (బ్రాహ్మణు)ల శాపమనే దంభోళి (వజ్రాయుధపు)చావుదెబ్బకు గురియై, నరనాథుడై కూడా వరం వంటి తన ‘నర’జన్మను వ్యర్థ పరచుకొని నరకాన్ని పొందాడు. అతనికి సాక్షాత్ పురుషోత్తముడే ‘పృథువు’ అనే పుత్రుని రూపంగా ఈ పుడమిపై అవతరించాడు. పవిత్రమైన పుత్ర నామాన్ని అపవిత్రం చేసిన తన పితృదేవుని పున్నామ నరకం నుంచి పరిరక్షించి ‘పుత్ర’ నామాన్ని సార్థకం చేశాడు- ‘వాని జన్మంబు సఫలమెవ్వాని వలన, వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు’ అన్న సుభాషితానికి సుందర ఉజ్జల దృష్టాంతంగా దర్శనీయతముడయ్యాడు. నారాయణ కళాంశ సంజాతుడైన ఆ పృథు భూపతి ధరణి (భూమి)ని ధేనువుగా చేసి అమూల్యములైన అనేక పదార్థాలను పిదికాడు. ప్రజలకు పంచి పెట్టాడు వేన పుత్రుడు వైన్యుడు.
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! మిత్రా పుత్రుడు మైత్రేయుడు, వ్యాస మహర్షి వరప్రసాదుడు, వాసుదేవుని దాసానుదాసుడు అయిన విదురునికి ‘పృథు’ చరిత్రను ఇలా వక్కాణించాడు- ధ్రువుడు, అంగుడు అంతటి రాజర్షులు… మహా భాగవతులు, మహా వీరులు, బ్రహ్మవేత్తలు ఆవిర్భవించిన స్వాయంభువ మనువంశం ఇంతటితో అంతరించి పోరాదని వసంతం వలె సంతతం విశ్వహిత చింతనాపరులైన సంతులు (మహాత్ములు) పంతం పూని అపుత్రకుడైన వేనుని శవాన్ని సమీపించి అతని బాహువులను మథించారు. ‘బాహూ రాజన్యః కృతః’ అని పురుష సూక్తం. బాహువులు (భుజాలు) క్షత్రియ శక్తికి సంకేతాలు. కుడి చేతి నుండి నారాయణుని అంశతో పాలక శక్తికి ప్రతీకగా ప్రసిద్ధుడు, పృథివీపతి శ్రేష్ఠుడు అయిన పృథు చక్రవర్తి, ఎడమ చేతి నుండి అనపాయిని- నారాయణుని ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశతో ‘అర్చి’ మహారాణి ఆవిర్భవించారు. ఈ మంథన క్రియ (చిలకడం) మహర్షుల మహిమామయ అతీంద్రియ మహాశక్తులకు తార్కాణం. విలక్షణమైన విచక్షణతో కూడిన విజ్ఞానానికి సంకేతం! మంథనం లేక మథనం అనగా వస్తుసారాన్ని వెలికి తీయడం. ‘అన్నేన భూతాని జాయన్తే జాతాన్యన్నేన వర్ధన్తే’- అన్నంలో నుంచి ప్రాణులు-ప్రాణాలు పుడుతున్నాయి. అన్నంతోనే పెరుగుతున్నాయి. మరి అన్నం అప్రాణమా? (జడమా?), సప్రాణమా? (చేతనమా?). జీర్ణకోశంలో మంథనం జరిగితేనే కదా తిన్న అన్నం (ఇంధనం) నుంచి శక్తి విడుదలౌతోంది! అన్న సారంగా రక్తం, దాని సారతమ రూపంగా వీర్యం ఉత్పన్నమవుతున్నాయి. వీర్యం నుంచి జీవోత్పత్తి. పాల పరిణామమైన పెరుగును మథిస్తే క్షీరసారమైన వెన్న వెలికి వస్తోంది. కన్నయ్యకు వెన్న అంటే ఇష్టం. సారం సంగ్రహించడం సూరి (పండిత) లక్షణం! ‘అసారాత్ సారమాహరేత్’- అసారం నుంచే సారం సాధించాలని సనాతన ధర్మ శంఖారావం! పారమార్థికంగా… మనస్సును అరణి- (క్రింది కట్టెగను), ఓంకారాన్ని ఉత్తరారణి (పై కట్టెగను) చేసి జ్ఞాని ధ్యానాభ్యాసమనే మథనం గావించి, జ్ఞానాగ్నిలో అజ్ఞాన పాశాన్ని దహించి, ఈ జడమైన దేహంలో నివురు గప్పిన నిప్పులా నిగూఢంగా ఉన్న దేవుని దర్శించాలని బ్రహ్మ, కైవల్య ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ‘జ్ఞాన నిర్మథనా భ్యాసాత్ పాశం దహతి పండితః’
అయోనిజులు, అవతార మూర్తులు అయిన అర్చి- పృథువులు దంపతులయ్యారు. ఆ శుభవేళ ఇలలో దేవ దుందుభిధ్వనులు చెలరేగాయి. దేవతలు పూల వానలు కురిపించారు. భూదేవతలు పృథువుకు పట్టాభిషేకం చేశారు. ఉత్సవ సందర్భంగా కుబేరుడు సువర్ణ సింహాసనం, ఇంద్రుడు కిరీటం, వాయువు చామరాలు, యముడు రాజదండం, లక్ష్మీదేవి సంపద, చక్రపాణి సుదర్శన చక్రం, చంద్రుడు అమృతమయాలైన తెల్లని గుర్రాలు, పార్వతీదేవి డాలు, భూదేవి యోగమయాలైన పాదుకలు, వాణీదేవి ఆణిముత్యాల హారం.. ఇలా ప్రధాన దేవతలు వారి వారి దివ్యశక్తులనే బహుమతులుగా వసుమతీశునికి బహూకరించారు. మహర్షులు అమోఘమైన ఆశీస్సులు అందించారు. సూతులు, వంది మాగధులు పరిపరి విధాల ప్రస్తుతించగా పృథువు మందహాసం చేస్తూ.. ‘అయ్యా! నాయందు ఇప్పటికి ఏ సుగుణాలూ లేవు. నా జన్మ-కర్మలు, నా వ్యవహార వ్యాపార చేష్టలు అన్నీ భవిష్యత్ కాలగర్భంలోనే అవ్యక్తంగా ఉన్నాయి. నన్నెందుకు మరీ పసిపిల్లల లాగా అభినందిస్తున్నారు? ఉదారులైన వారు అతిహేయములైన ఆత్మస్తుతిని పరనిందలనూ సహించరు’ అని వారిని వారించాడు.‘ఆరోపగుణ కథనం స్తుతిః’ పురుషునిలో లేని సుగుణాలను ఆరోపించి అతిరంజితంగా అభివర్ణించడం స్తుతి. ప్రాకృత పురుషుల గుణగానం అతిశయోక్తి. ఎందుకని? ఏ దోషం లేని జీవుడు ఉండడు కాన. సర్వదోష రహితుడు, సకల సుగుణ శోభితుడు అయిన సర్వేశ్వరుని ఎంత పొగడినా రవ్వంతే! నిజానికి అది స్తుతి కాదు, నుతి. స్వభావోక్తి! అరతి విరతి (విసుగు-విరామం) లేని సన్మతి చేసే సన్నుతి! (సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006