తాన్యాదేశాయ్, అంకిత్‌రాజ్, వినోద్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. విశ్వ దర్శకుడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ ‘సుదీర్ఘవిరామం తర్వాత నేను ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రమిది. ప్రేమ, కుటుంబవిలువలు, క్రైమ్ అంశాలతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. పెద్దమనుషులుగా చెలామణి అయ్యే కొంతమంది చీకటి జీవితాల్ని ఇందులో ఆవిష్కరించాం’ అని తెలిపారు. ‘తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల మూడో వారంలో సినిమాను విడుదలచేస్తాం’ అని నిర్మాత పేర్కొన్నారు.