సినిమాలతో మొదలుపెట్టి సీరియళ్లలోనూ మంచిపేరు తెచ్చుకుంది నటి విష్ణుప్రియ. ‘అభిషేకం’ ధారావాహిక ద్వారా బుల్లితెరకు పరిచయమై, ప్రస్తుతం జీ తెలుగు ‘త్రినయని’ సీరియల్‌తో తెలుగువారికి మరింత దగ్గరైంది. చక్కటి అభినయంతో ప్రతిరోజూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న విష్ణుప్రియ తన అనుభవాలను జిందగీతో ఇలా పంచుకున్నది..
నటన ఇష్టమైనా కెమెరా ముందు నటించడం కాస్త కష్టమైన విషయమే. కానీ నాకు చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ తెలియదు. ఏడెనిమిదేండ్లకే వేదికల మీద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేదాన్ని. అందుకే నటించడం పెద్ద సమస్య కాలేదు. నేను పుట్టింది హనుమాన్ జంక్షన్లో. సొంతూరు గుడివాడ. నాన్న ఇంటీరియర్ డిజైనర్. మా తాతయ్య వాళ్లకు వివిధ కార్యక్రమాలకు మైక్‌లు ఏర్పాటు చేసే వ్యాపారం ఉండేది. అలా మైక్సెట్లు ఏర్పాటు చేసినప్పుడు.. అక్కడ నేను డ్యాన్స్, స్కిట్స్ లాంటివి చేసేదాన్ని. దాంతో నాకు జనం ముందు యాక్ట్ చేయడం అంటే భయం లేకుండా పోయింది. మేం హైదరాబాద్ వచ్చాక, సూపర్‌స్టార్ కృష్ణగారి ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసే అవకాశం నాన్నకు వచ్చింది. ఆ సందర్భంలో ఒక ఫంక్షన్‌కి నేను కూడా వెళ్లాను. ఒక తమిళ డైరెక్టర్ నన్ను చూసి ఫొటోలు తీసుకున్నారు. ఆయన తీసిన ఓ సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటికి నాకు పద్నాలుగేండ్లు.
తమిళ చిత్రం తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ‘ఈ రోజుల్లో’ సినిమా చేశాను. దీంతో సీరియళ్లలోనూ అవకాశాలు వచ్చాయి. అభిషేకం సీరియల్ కోసం వాళ్లే వెంటపడి మరీ నన్ను తీసుకున్నారు. అందులో 2,800 ఎపిసోడ్లు చేశాను. ఆ వెంటనే… ఇద్దరమ్మాయిలు, కుంకుమపువ్వు, జానకి కలగనలేదు లాంటి ధారావాహికలతోపాటు ‘పండగ చేస్కో’, ‘ప్రేమకథా చిత్రం’, ‘ప్యార్‌లో పడిపోయానే’లాంటి సినిమాలు చేశాను. సీరియళ్లకు వచ్చేప్పటికి నాకు పదిహేడేండ్లు. దాంతో నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకోగలిగా. కెరీర్ పరంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు అవకాశాలు అవే వచ్చాయి. నేను అడిగి, ఎదురు చూసిన సందర్భం ఒక్కటీ లేదు.
‘నేను నా ఫ్రెండ్స్’ సినిమాలో సిద్ధార్థ్ వర్మ, నేను హీరోహీరోయిన్లుగా చేశాం. తను కూడా నటుడు అవడంతో మా అభిప్రాయాలు కలిశాయి. ఈ సినిమాతో చిగురించిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. మా కులాలు వేరైనా ఇంట్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. దాంతో మా పెండ్లి సాఫీగానే సాగిపోయింది. మూడో వివాహ వార్షికోత్సవానికి బాబు పుట్టాడు. వాడికిప్పుడు మూడేండ్లు. మా బాబు ముచ్చట్లు చూడాలనీ, నా వ్యక్తిగత అభిరుచులు తెలుసుకోవాలనీ ఇన్‌స్టాలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ మెసేజ్‌లు పెడుతుండేవారు అభిమానులు. దీంతో మా భార్యాభర్తల పేర్లు కలిసి వచ్చేలా ‘సిదిష్ణు’ పేరిట యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాను. దానికి సుమారు అయిదు లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. మామూలుగా అయితే ఉదయం ఏడింటికి వెళ్తే, రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వస్తా. మా భోజనాలు, బాబు సంగతి… అన్నీ మా అత్తగారే చూసుకుంటారు. ఏ కాస్త తీరిక దొరికినా బాబుతో గడపడానికి ఇష్టపడతా. నటనా రంగంలో తెలుగమ్మాయిలు తక్కువ. అలాంటి చోట నాకు అవకాశాలు రావడం దేవుడి దీవెనగా భావిస్తా. మునుముందు మరింత మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తా.