Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన రాజమౌళి, ఇప్పుడు తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’తో భారీ అంచనాలను సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాజమౌళి తన చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలతో అంతర్జాతీయ సినీ అభిమానులను కలుస్తున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ ‘లా సినెమాటెక్ ఫ్రాంకైస్’ థియేటర్లో జూన్ 26న ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
ఈ స్క్రీనింగ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ అందించారు. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’తో పాటు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్-1’కు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ప్రదర్శించారు. స్క్రీన్‌పై మహేశ్ బాబు ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లోని ఫ్రెంచ్ ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, కేరింతలతో హాల్‌ను మార్మోగించారు. గ్లింప్స్ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు కొంతసేపు నిలబడి చప్పట్లు కొట్టడం విశేషంగా మారింది. ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకోగా, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. విదేశీ ప్రేక్షకులు మహేశ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఇచ్చిన స్పందన అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
ఈ వీడియోకు చిత్ర యూనిట్ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లో ‘వారణాసి’ గ్లింప్స్‌కు లభించిన స్పందన అద్భుతమని, ప్రేక్షకుల చప్పట్లు మరపురాని అనుభూతిని ఇచ్చాయని పేర్కొన్నారు. రాజమౌళి యూరప్ పర్యటనలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ సినీ విద్యార్థులు, అభిమానులతో మాస్టర్ క్లాస్‌లలో కూడా పాల్గొంటున్నారు.ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫ్ గాన్స్తో కలిసి రాజమౌళి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం స్విట్జర్లాండ్‌లోని న్యూచాటెల్ నగరంలో జరిగే కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. అయితే పారిస్‌లో ‘వారణాసి’ గ్లింప్స్‌కు లభించిన స్పందనతో సినిమా పట్ల అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ మరోసారి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.