Ustaad Bhagat Singh | ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్పష్టమైన మార్పు ఒకటి కనిపిస్తోంది. స్టార్ హీరోల క్రేజ్ కంటే కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. హీరో ఎవరు అన్నది కాకుండా సినిమా ఎలా ఉందన్నదే బాక్సాఫీస్ ఫలితాలను నిర్ణయిస్తోంది. మొదటి రోజు ఓపెనింగ్స్‌కు స్టార్ పవర్ పని చేసినా, రెండో రోజు నుంచే అసలు రిజల్ట్ బయటపడుతోంది.ఇటీవల ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మూడో సినిమా కావడం విశేషం.
అంతకుముందు వచ్చిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు వేర్వేరు ఫలితాలను అందించాయి. అందులో ఒకటి డిజాస్టర్ కాగా, మరొకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే, మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా నాలుగు రోజుల్లో సుమారు రూ.82 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. నాలుగో రోజు కలెక్షన్లు దాదాపు రూ.8 కోట్ల వద్దే నిలవడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకి ఇవి తక్కువ వసూళ్లుగా భావిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.123 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు అవసరం.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా కనిపిస్తోంది. అయితే రెండో వారం వరుస సెలవులు, ప్రత్యేకంగా శ్రీరామ నవమి, వీకెండ్ కలిసి రావడం ఈ చిత్రానికి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది.ఏది ఏమైన స్టార్ హీరో ఉన్నా సరే కంటెంట్ బలంగా లేకపోతే సినిమా నిలబడదన్న విషయాన్ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరోసారి స్పష్టం చేసింది. ఇక ఈ సినిమా రెండో వారం కలెక్షన్లు ఎలా ఉంటాయో, పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.