SR Kalyana Mandapam Review| ఎస్.ఆర్.కల్యాణమండపం రివ్యూ
రాజావారు రాణిగారు తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన చిత్రం ఎస్.ఆర్.కల్యాణమండపం (SR Kalyana Mandapam). తండ్రీ కొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే..

రాజావారు రాణిగారు సినిమాతో ప్రతిభావంతుడైన కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ఎస్.ఆర్.కల్యాణమండపం (SR Kalyana Mandapam). పాటలు, ప్రచార చిత్రాలతో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. శ్రీధర్ గాదే (Sridhar Gade)దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మించారు. ఈ శుక్రవారం పలు చిన్న చిత్రాలతో పోటీపడి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నది. హీరోగా, కథకుడిగా కిరణ్ అబ్బవరం విజయాన్ని అందుకున్నాడా? లేదా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కల్యాణ్(కిరణ్ అబ్బవరం) బీటెక్ స్టూడెంట్. తన స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. సింధును(ప్రియాంక జవాల్కర్) (Priyanka Jawalkar) ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె మాత్రం అతడిని ద్వేషిస్తుంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే కల్యాణ్ తల్లి నుంచి ఫోన్ రాగానే ముభావంగా మారిపోతాడు. చిన్నతనంలో తండ్రి ధర్మ(సాయికుమార్) ( SaiKumar)ఆలనపాలనలో పెరిగిన కల్యాణ్ ఆ తర్వాత అతడిపై కోపంతో పదేళ్లుగా మాట్లాడటం మానేస్తాడు. కొడుకు తనతో మాట్లాడకపోవడంతో ఆ బాధలో ధర్మ తాగుడుకు బానిసగా మారిపోయి సమాజం దృష్టిలో చేతకానివాడిగా ముద్రపడతాడు.
కుటుంబ పరిస్థితి దిగజారిపోవడంతో తల్లి మాటకు కట్టుబడి వారసత్వంగా సంక్రమించిన ఎస్.ఆర్ కల్యాణమండపానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కల్యాణ్ సంకల్పిస్తాడు. ఆ లక్ష్యసాధనలో కల్యాణ్ విజయం సాధించాడా? ఎస్.ఆర్ కల్యాణమండపానికి ఉన్న ఘన చరిత్ర ఏమిటి? తన పట్ల కొడుకులో దాగి వున్న అమితమైన ప్రేమను ధర్మ ఎలా గుర్తించగలిగాడు? సింధు ప్రేమ కోసం ఆమె తండ్రి తాకట్టు పాపారావుతో కల్యాణ్ ఎలాంటి పోరాటం సాగించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

జీరోగా మారిన తండ్రిని హీరోగా నిలబెట్టాలని..
అనుబంధాలు, ఆప్యాయతలను డబ్బు ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. మంచితనం కారణంగా ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి జీరోగా మారిన తన తండ్రిని తిరిగి హీరోగా నిలబెట్టాలని కలలు కన్న ఓ కొడుకు సాగించే ప్రయాణాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్ హంగుల్ని మేళవిస్తూ హీరో కిరణ్ అబ్బవరం ఈ కథ రాసుకున్నారు. ప్రథమార్థం హీరో తన స్నేహితులతో కలిసి చేసే ఫైటింగ్స్, కాలేజీ లవ్ ట్రాక్‌తో సరదాగా సాగిపోయింది. కల్యాణ మండపాన్ని నిలబెట్టే బాధ్యతను హీరో తన స్నేహతులతో కలిసి స్వీకరించే సన్నివేశాలతో అసలు కథ మొదలవుతుంది.
ఇరవై ఏళ్లుగా ఎలాంటి శుభకార్యాలకు నోచుకోని ఆ కల్యాణమండపానికి కొత్త శోభను తీసుకొచ్చేందుకు హీరో పడే కష్టాల్ని వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.. ద్వితీయార్థంలో ప్రేమకథతో పాటు తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణను బ్యాలెన్స్ చేస్తూ నడిపించారు. తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి కుదరడంతో దానిని చెడగొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు కామెడీగానే తీర్చిదిద్దారు. పతాక ఘట్టాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కొడుకు పట్ల తనకున్న ప్రేమను గుర్తించిన ధర్మలో ఎలా పరివర్తన వచ్చిందో చక్కగా చూపించారు.

హీరో కిరణ్ అబ్బవరం చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా దానిని తెరపై ఆవిష్కరించే విధానంలో మాత్రం తప్పటడుగులు ఎక్కువగా వేశారు. మద్యం తాగే సన్నివేశాలతో సినిమా మొత్తం నింపేశారు. వాటికి తోడు నాయకనాయికల మధ్య ప్రేమలో ఆసక్తి లోపించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడేలా ఆ సన్నివేశాలన్నీ సాగుతాయి. కథానాయికకు ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్లిని తన స్నేహబృందం కలిసి ఆపేందుకు హీరో వేసే ప్లాన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిచాయి. కల్యాణ మండపంలో తిరిగి పెళ్లిళ్లు జరిపేందుకు హీరో చేసే ప్రయత్నాల్లో కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కల్యాణ్ తన తండ్రితో పదేళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉంటాడనే అంశాన్ని బలంగా చూపించలేకపోయారు. వాటికి తోడు ఒక్క డైలాగ్‌లో సాయికుమార్‌లో మార్పు వచ్చినట్లుగా చూపించడం పెద్దగా ఆకట్టుకోదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దుకుంటే మంచి సినిమా అయ్యుండేది.
స్పెషల్ అట్రాక్షన్ గా సాయికుమార్ పాత్ర
ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య సంఘర్షణకు లోనయ్యే సగటు రాయలసీమ కుర్రాడిగా కిరణ్ అబ్బవరం సహజంగా నటించారు. ఎమోషన్స్‌తో కూడిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తనను తాను మాస్ హీరోగా ఆవిష్కరించుకోవాలని అతడు రాసుకున్న ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. కొడుకు ప్రేమ కోసం పరితపించే తండ్రిగా సాయికుమార్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. తన అనుభవంతో పతాక ఘట్టాల్ని నిలబెట్టారు. గ్లామర్ పరంగా ప్రియాంక జవాల్కర్ పర్వాలేదనిపించింది. అభినయం విషయంలో మరింత పరిణతి రావాలి. హీరో స్నేహితులుగా నటించిన అనిల్‌తో పాటు మిగతా ఇద్దరి పాత్రలు పడించిన కామెడీ అక్కడక్కడ వర్కవుట్ అయ్యింది.
హీరోగానే కాకుండా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణల్నిసైతం కిరణ్ అబ్బవరం అందించారు. పల్లెల్లో ఉపయోగించే రాయలసీమ యాసను ఉపయోగిస్తూ వచ్చే సంభాషణలు బాగున్నాయి. పూర్తిగా వాటికే కట్టుబడిపోకుండా మిగతా యాసలు అక్కడక్కడ వినిపించడం కన్ఫ్యూజన్కు గురిచేసింది. దర్శకుడు శ్రీధర్ గాదే ప్రేమకథను సరిగ్గా చూపించలేకపోయారు. సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. చూశానే కళ్లారా, చుక్కల చున్నీ పాటలు ఆకట్టుకున్నాయి. ఎస్.ఆర్. కల్యాణమండపం కొత్తదనం లేని కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. బీ,సీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత థియేటర్లో విడుదలైన మాస్ సినిమా ఇదే కావడంతో వారి ఆదరణ ఎంతవరకు ఉంటుందో వేచిచూడాల్సిందే.
రేటింగ్-2.25/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

