‘కామెడీ జోనర్ అంటే నాకు చాలా ఇష్టం. గతంలో చేసిన కొన్ని కామెడీ సినిమాలు వర్కవుట్ కాలేదు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే రాబట్టుకోవాలనే తపనతో ఈ సినిమా చేశాను. తప్పకుండా హిట్ కొట్టబోతున్నాం’ అన్నారు వీజే సన్నీ. ఆయన కథానాయకుడిగా సంజయ్‌శేరి దర్శకత్వంలో రూపొందిన ‘సౌండ్ పార్టీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీరామ్ గజేంద్ర నిర్మాతలు.
ఈ సందర్భంగా హీరో వీజే సన్నీ మాట్లాడుతూ “బిగ్‌బాస్’ తర్వాత నేను చేసిన బెస్ట్ సినిమా ఇది. ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగుతుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని వినోదప్రధానంగా చూపించాం. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో వినోదంతో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బిట్‌కాయిన్ ప్రస్తావన కూడా ఉంటుంది. నా తండ్రిగా శివన్నారాయణ అద్భుతమైన కామెడీ పండించాడు. మా కాంబినేషన్ సన్నివేశాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. అమెరికాలో వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఎన్నికల టైమ్‌లో వస్తున్న మా సౌండ్ పార్టీకి అన్ని పార్టీల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా’ అన్నారు.