నాని సినిమా థియేటర్స్‌లో విడుదలై రెండేళ్లు దాటిపోయింది. కెరీర్లో థియేటర్స్‌కు ఎక్కువ కాలం అతడు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ లోటును భర్తీ చేసే చిత్రంగా శ్యామ్సింగరాయ్పై ఎన్నో ఆశలను పెట్టుకున్నారాయన. క్రిస్మస్ మాదే అంటూ ప్రచార వేడుకల్లో సినిమా విజయంపై బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రచార చిత్రాల్లో నాని రెండు పాత్రల్లో కనిపించడం, దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా పాటలు రాసిన సినిమా ఇదే కావడంతో అందరిలో శ్యామ్‌సింగరాయ్ పట్ల ఆసక్తి మొదలైంది. రెండేళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన నానికి అదృష్టం కలిసివచ్చిందా?హిట్ అందుకున్నాడా?నాని నమ్మకాన్ని రాహుల్ సంకృత్యాన్ నిలబెట్టాడా?లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
సినీ దర్శకుడవ్వాలనే ప్రయత్నాల్లో ఉంటాడు వాసుదేవ్(నాని). ఓ షార్ట్ఫిలిమ్ తీసి తన ప్రతిభను నిరూపించుకోవాలన్నది అతడి ఆలోచన. ఆ షార్ట్ఫిలిమ్కు సరిపోయే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడికి కీర్తి(కృతిశెట్టి)తారసపడుతుంది. కొన్నాళ్ల ప్రయాణంలో ఇద్దరు ప్రేమలోపడతారు. కలిసి బతకాలని అనుకుంటున్న తరుణంలో వాసుదేవ్‌ను అపార్థం చేసుకున్న కీర్తి అతడికి దూరంగా వెళ్లిపోతుంది. కీర్తి దూరమైన తర్వాత కెరీర్‌పై దృష్టిపెట్టిన వాసుదేవ్ ఉనికి పేరుతో ఓ సినిమా తీస్తాడు. అది పెద్ద హిట్ అవ్వడంతో బాలీవుడ్లో దర్శకుడిగా అతడికి అవకాశమొస్తుంది. హిందీ సినిమాకోసం ముంబయి వెళ్లిన అతడిని కాపీరైట్ యాక్ట్ నేరానికి గాను పోలీసులు అరెస్ట్ చేస్తారు. 1970 కాలానికి చెందిన శ్యామ్‌సింగరాయ్(నాని) అనే రచయిత నవలను కాపీ కొట్టి వాసుదేవ్ సినిమా తీశాడని అతడిపై పబ్లిషర్స్సంస్థ కేసుపెడుతుంది. బెంగాళ్‌లోని కాళికాపురం అనే గ్రామానికి చెందిన శ్యామ్‌సింగరాయ్ సమాజంలో నెలకొన్న కులవివక్షపై పోరాటం చేస్తుంటాడు.
అతడి ఆలోచన విధానాన్ని సొంత కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తుంటారు. అదే ఊరికి చెందిన దేవదాసి మైత్రేయి(సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు శ్యామ్‌సింగరాయ్. ఆ కట్టుబాట్ల వలయం నుంచి మైత్రేయి విడిపించిన శ్యామ్‌సింగరాయ్ ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కొల్కతాలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన శ్యామ్‌సింగరాయ్ రచయితగా మంచి పేరుతెచ్చుకుంటాడు. వారి వైవాహిక బంధం సాఫీగా సాగిపోతున్న తరుణంలో హఠాత్తుగా శ్యామ్‌సింగరాయ్ అదృశ్యమవుతాడు. అతడు ఎక్కడకు వెళ్లిపోయాడు. 1970కి చెందిన శ్యామ్‌సింగరాయ్ రెండువేల దశకానికి చెందిన వాసుదేవ్‌కు ఉన్న సంబంధమేమిటి?మైత్రేయికి ఇచ్చిన మాటను శ్యామ్‌సింగరాయ్ ఎలా నిలబెట్టుకున్నాడు?వారి ప్రేమకథ చివరకు ఏమైంది అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
పునర్జన్మల కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి మూగమనసులు నుంచి ఈ కథాంశంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. పునర్జన్మలకు బెంగాళీ నేపథ్యాన్ని దేవదాసి దురాచారాన్ని జోడిస్తూ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈసినిమాను తెరకెక్కించారు. రెండు కాలాల వ్యవధుల్లో సాగిన ఈ సినిమాలో 1970 నాటి సామాజిక జీవన పరిస్థితులను, దురాచారాలను చూపుతూనే అంతర్లీనంగా ప్రేమకథను అల్లుకున్నారు. ప్రథమార్థంలో దర్శకుడవ్వాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఓ అప్‌కమింగ్ డైరెక్టర్ చేసే ప్రయత్నాలను వినోదం, ప్రేమ కలగలిపి నడిపించారు. ద్వితీయార్థంలోదేవదాసిల పేరుతో మహిళలను కట్టుబానిసలుగా మార్చే సంస్కృతి, ఆ దురాచారానికి బలైపోయి మహిళలు ఎదుర్కొంటున్న సంఘర్షణపై ఓ రచయిత పోరాటాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు రాహుల్సంకృత్యాన్. రెండింటి మధ్య సంబంధాల్ని కలపడం కోసం సైంటిఫిక్ అంశాల జోలికి పోకుండా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నారు. సింపుల్‌గా ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చూపించారు.
సత్యదేవ్ జంగా రాసిన పాయింట్ తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ కథను డెవలప్ చేశారు దర్శకుడు రాహల్ సంకృత్యాన్. ఆ జోడింపులో కొంత డోస్ తగ్గింది. ప్రథమార్థంలో నవ్వించేందుకు చాలా ఆస్కారముంది. అది వాడుకోలేదు. నాని, కృతిశెట్టిల ప్రేమకథ కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయారు. కాపీరైట్ చట్టం ప్రకారం నాని ఆరెస్ట్ అయిన తర్వాతే సినిమాలో వేగం పెరుగుతుంది. 1970 కాలాన్ని పునసృష్టించడానికి చిత్రబృందం చేసిన పరిశోధన, వేసిన సెట్స్ ఆకట్టుకుంటాయి. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి. నాని, సాయిపల్లవి ప్రేమకథ హృద్యంగా సాగుతుంది. సినిమాను ముగించిన తీరు విభిన్నంగా ఉంది.
రెండు పాత్రల్లో నాని చక్కటి వేరియేషన్‌ను చూపించారు. వాసుదేవ్ పాత్రలో ైస్టెలిష్‌గా కనిపించారు. శ్యామ్సింగరాయ్గా అతడి లుక్, ఆహార్యం 1970 కాలానికి తగినట్లుగా ఉన్నాయి. తనదైన కామెడీ టైమింగ్,బాడీలాంగ్వేజ్ కనబడకుండా ఇంటెన్సివ్‌గా నటించారు. శ్యామ్ పాత్రలో అతడి హావభావాలు , డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. మైత్రేయి పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయింది. సమాజ కట్టుబాట్లకు, ప్రేమ మధ్య నలిగిపోయే యువతిగా చక్కటి భావోద్వేగాల్ని పలికించింది. ప్రణావలయ పాటలో ఆమె ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూవ్మెంట్స్ మెప్పిస్తాయి. కృతిశెట్టి అందంగా కనిపించింది. నటించడానికి ఆమెకు అవకాశం రాలేదు. మడోన్నా సెబాస్టియన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. రాహుల్ రవీంద్రన్, జిషుసేన్‌గుప్తా చిన్న పాత్రలే దక్కాయి. అభినవ్ గోమటం నవ్వులు రెండు, మూడు సన్నివేశాలకు పరిమితమయ్యాయి.
సినిమాటోగ్రాఫర్ సానుజాన్ వర్గీస్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సినిమాకు నిజమైన హీరోలుగా నిలిచారు. రెండు కాలాల మధ్య వేరియేషన్స్‌ను సినిమాటోగ్రఫీ ద్వారా చక్కగా చూపించారు సాను జాన్ వర్గీస్. కోల్‌కతా నేటివిటీని తన సెట్స్ ద్వారా పునరావిష్కరించారుఅవినాష్ కొల్లా. సంప్రదాయ, వెస్ట్రన్ రెండు సంగీతాల్ని మేళవిస్తూ మిక్కీ జే మేయర్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన చివరి సినిమా ఇది. ఆయన రాసిన సిరివెన్నెల, ప్రణవాలయ పాటలు సినిమాకు పెద్దగా బలంగా నిలిచాయి.
చాలా గ్యాప్ తర్వాత నాని నటించిన ప్రేమకథా చిత్రమిది. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఈ సినిమాతో అతడికి దొరికింది. నాని అభిమానుల్ని ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. వైవిధ్యమైన ప్రయత్నంగా ఈ సినిమా నిలిచిపోతుంది. కమర్షియల్‌గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే
రేటింగ్-3/5