1 Nenokkadine | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘1: నేనొక్కడినే’ (2014) సినిమాతోనే కృతి సనన్ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ డెబ్యూ మూవీ జ్ఞాపకాలను పంచుకుంటూ, సినిమా ఒప్పుకునే సమయానికి తనకు తెలుగు సినిమాలపై గానీ, మహేష్ బాబు రేంజ్ ఏంటో గానీ పెద్దగా అవగాహన లేదని ఆమె చెప్పారు. తాను హిందీ సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మొదట్లో మహేష్ బాబుని కలిసినప్పుడు ఒక నార్మల్ సీనియర్ నటుడిలా చాలా క్యాజువల్‌గా కలిశానని, ఆయనకున్న క్రేజ్ ఏంటో తనకు అప్పుడు తెలియదని అన్నారు. కానీ, ఎప్పుడైతే తాను ‘1: నేనొక్కడినే’ షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టానో, ఆ తర్వాత జరిగిన భారీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కళ్లారా చూశానో… అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్, ఆయనకున్న స్టార్డమ్, అబిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ ఏంటో తనకు పూర్తిగా అర్థమైందని కృతి సనన్ వివరించారు.
నటనలో ఎలాంటి ముందస్తు శిక్షణ లేకపోయినా డైరెక్టర్ సుకుమార్ తనను నమ్మి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారని, షూటింగ్ లోకేషన్స్ కి వచ్చే జనాల్ని, ముఖ్యంగా థియేటర్లలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన ఊహించని రద్దీని చూసి తాను షాక్ అయ్యానని ఈ బాలీవుడ్ భామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014 జనవరిలో విడుదలైన ఈ సినిమా పరాజయం పాలవ్వగా.. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కృతి సనన్, తన కెరీర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రారంభం కావడం ఎప్పటికీ స్పెషల్ అని సంతోషం వ్యక్తం చేశారు.