న్యూఢిల్లీ: హాలీవుడ్ సినిమా రాంబో ( Rambo ) సీక్వెల్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో సిల్వస్టర్ స్టాలోన్ నటించిన ఆ సినిమా ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో సాగుతుంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆ సినిమా అప్పట్లో అందర్నీ ఆకట్టుకున్నది. 1980 దశకంలో రిలీజైన ఆ రాంబో సీక్వెల్స్‌కు సంబంధించిన కొన్ని సీన్లు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో.. అప్పట్లో రాంబో చేసిన సాహస విన్యాసాలు ఇప్పుడు ఆన్లైన్లో అలరిస్తున్నాయి. రాబో-3కి చెందిన కొన్ని సీన్లు తాజాగా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలో కల్నల్ సామ్ ట్రౌట్మ్యాన్ను సోవియట్ దళాలు బంధిస్తాయి. అతన్ని ఆఫ్ఘన్ కొండల్లో దాచిపెడుతాయి. అయితే అతన్ని విడిపించి వెళ్లేందుకు రాంబో రంగంలోకి దిగుతాడు. ఆఫ్ఘన్ లోయల్లో సిల్వస్టర్ స్టాలోన్ చేసిన స్టంట్స్ హాలీవుడ్లో కేక పుట్టించాయి.
అయితే తాజాగా వైరల్ అవుతున్న కొన్ని క్లిప్పుల్లో.. ఆఫ్ఘనిస్తాన్ సన్నివేశాలు ఉంటాయి. కల్నర్ ట్రౌట్మ్యాన్ ఓ సీన్లో హెచ్చరికలు చేస్తారు. మిడిల్ ఈస్ట్‌లో స్వేచ్ఛ పేరుతో యుద్ధం చేయడం దుర్మార్గం అంటు వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడి పేద ఫ్రీడం ఫైటర్ల ధాటికి మీ ఆయుధాలు నాశనం అవుతాయని కల్నల్ ట్రౌట్మ్యాన్ సోవియట్ సేనల్ని హెచ్చరిస్తాడు. ఇక్కడి స్థానికులు దేనికి లోంగిపోరంటారు. ఆక్రమణకు వచ్చినవారికి లొంగిపోవడం కంటే.. ఆఫ్ఘన్లు ప్రాణాలు ఇస్తారంటారు. ఇలాంటి ప్రజల్ని మీరు ఓడించలేరని సోవియట్‌కు వార్నింగ్ ఇస్తారు. ఇదొక్కటే కాదు.. మరో క్లిప్ కూడా య్యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నది.
రాంబో ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అన్న టైటిల్‌తో ఆ క్లిప్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ సీన్లో మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్లోకి రాంబో సిల్వర్‌స్టన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ సమయంలో ఆఫ్ఘన్ మిత్రుడు ఆ దేశ శౌర్యం గురించి అతనికి వివరిస్తాడు. ఇదే ఆఫ్ఘనిస్తాన్, అలెగ్జాండర్ దీన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడు. చెంగీస్ ఖాన్, బ్రిటీషర్లు, ఇప్పుడు రష్యన్లు అదే పనిచేస్తున్నారంటాడు. కానీ ఆఫ్ఘన్లు గట్టిపోరాడుతారు, వాళ్లు ఎన్నటికీ ఓడరని అంటాడు. ఆఫ్ఘన్ ప్రజల గురించి ప్రాచీన ప్రజలు ప్రార్థనలు చేస్తారని, కోబ్రా విషం నుంచి, పులి కోరల నుంచి, ఆఫ్ఘన్ల ప్రతీకారం నుంచి కాపాడాలంటూ దేవుణి వేడుకుంటారని అన్నారు.