Telugu Movies | ఎంత కాదన్నా సంక్రాంతి పండుగకు రిలీజయ్యే సినిమాలు టాక్‌తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయి. ఈ ఏడాది అది రుజువైంది కూడా. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వీరసింహా రెడ్డి సైతం వంద కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్న వీరయ్య ఏకంగా రెండొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చిరుకు తిరుగులేని కంబ్యాక్ అయింది. తెగింపు, వారసుడు వంటి డబ్బింగ్ సినిమాలు సైతం బయ్యర్లను సేఫ్ లైన్లోనే నిలబెట్టాయి. నిజానికి ఈ నాలుగు సినిమాలకు రిలీజ్ డేన మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఓవరాల్‌గా దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్ల కురిపించి.. సంక్రాంతిని సినిమా పండగ అని కూడా ఎందుకంటారో అని మరోసారి నిరూపించాయి.
ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి సిద్ధమైంది. ఆర్నెళ్లకు పైగా టైమ్ ఉన్న సంక్రాంతిపై ఇప్పటి నుంచే స్లాట్లు బుక్ అవుతున్నాయి. ఆరొందల కోట్లకు పైగా బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K సంక్రాంతి స్లాట్‌ను అందరికంటే ముందే బుక్ చేసుకుంది. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ రెండు, మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. మేకర్స్ మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మహేష్ గుంటూరు కారం కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుని వస్తుంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ వంటి వాటిలో ప్రత్యేకించి రిలీజ్ డేట్‌ను కూడా మెన్షన్ చేశారు.
షూటింగ్ కూడా చక చక పూర్తి చేస్తున్నారు. ఇక రీసెంట్గా రవితేజ ఈగల్ కూడా సంక్రాంతికే వస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చేసింది. ప్రముఖ ఛాయాగ్రహకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రమిది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ముప్పావుశాతం షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. తాజాగా సంక్రాంతి రేసులోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న హనుమాన్ మూవీ.
ముందుగా సమ్మర్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సినిమా ఎట్టిపరిస్తుతుల్లో వినాయక చవితికో లేదంటే దీపావళికో వస్తుందనుకుంటే ఏకంగా ఆర్నెళ్ల దూరంలో ఉన్న సంక్రాంతి పండగను ఫిక్స్ చేసుకుంది. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ను మరింత మెరుగ్గా చూపించడం కోసం మేకర్స్ ఈ నిర్ణయిం తీసుకున్నట్లు భోగట్టా. పైగా ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకట్టినట్లు చూశాం. అలాంటి లోపాలు హనుమాన్ సినిమాలో కనిపించొద్దని మేకర్స్ ఆలోచించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌లో వీర లెవల్లో అంచనాలు పెంచేసింది. వీఎఫ్ఎక్స్ చూసి ఆహా ఓహో అనుకున్న వారు లేరంటే అతిశయోక్తి కాదు.
అంత తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ ఎలా చూపించాడని నోళ్లు వెళ్లబెట్టిన వారు కోట్లల్లోనే ఉన్నారు. అలా ఈ సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. దాంతో ప్రేక్షకులు అంచనాలను ఏ మాత్రం డిసప్పాయింట్ చెయ్యొద్దని.. లేటైనా మంచి అవుట్ పుట్ తీసుకురావాలని ఈ ప్లాన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఈ నాలుగు సినిమాలతో పాటుగా పరుశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతిపైనే కన్నేసినట్లు తెలుస్తుంది. ఇక చిరు-కళ్యాణ్ కృష్ణ సినిమా కూడా వీలైతే సంక్రాంతి పండగనే క్యాష్ చేసుకోవాలని భావిస్తుందట. మొత్తం మీద వీటిలో ఎన్ని సినిమాలు సంక్రాంతి రేసులో ఉంటాయో.. ఎన్ని సినిమాలు వాయిదా పడతాయో చూడాలంటే మరో ఆర్నెళ్లు ఆగాల్సిందే.