Samyuktha Menon | నిస్సహాయులైన మహిళలకు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది అగ్ర కథానాయిక సంయుక్తమీనన్. ‘ఆదిశక్తి’ పేరుతో సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా లక్ష్యం. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మా సంస్థ మహిళలకు అండగా నిలుస్తుంది.
అన్ని వయసుల మహిళలకు చేయూతనందిస్తాం. స్త్రీలకు సమాన అవకాశాలు కల్పిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడపాలన్నదే మా సంస్థ లక్ష్యం’ అని చెప్పింది. ‘భీమ్లానాయక్’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ మలయాళీ సోయగం బింబిసార, డెవిల్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులకు చేరువైంది.