Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినీ ఇండస్ట్రీలోకి అనుకోకుండా అడుగుపెట్టానని వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్న తన కల నెరవేరి ఉంటే, ఈ రోజు తాను సినిమాల్లో ఉండేదాన్ని కాదని సమంత చెప్పడం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజాగా తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల నిర్వహించిన ‘సుమ చాట్ షో’లో పాల్గొన్న సమంత, తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చదువు, ఉద్యోగం, మోడలింగ్, సినిమా అవకాశాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సమంత మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం హోటళ్లలో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో అతిథులను స్వాగతించే పని చేసేదాన్నని తెలిపారు. రోజుకు రూ.500 పారితోషికం ఇచ్చేవారని, ఆ డబ్బు కోసం ఎనిమిది గంటల పాటు నిలబడి పనిచేయాల్సి వచ్చేదని చెప్పారు. చిన్నప్పటి నుంచే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉండేదని వెల్లడించారు. ఇక షోలో పాల్గొన్న దర్శకురాలు నందిని రెడ్డి కూడా సమంత గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. చదువులో టాపర్ అయిన సమంతకు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనే బలమైన కోరిక ఉండేదని, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ అవకాశం రాలేదని చెప్పారు. ఆ తర్వాతే సమంత మోడలింగ్, ఆడిషన్ల వైపు అడుగులు వేసిందని వెల్లడించారు.
దీనిపై స్పందించిన సమంత.. నిజంగానే ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకోవాలని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్లు పంపలేకపోయారు. ఆ తర్వాత మోడలింగ్ చేయడం, ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఒకవేళ నేను విదేశాలకు వెళ్లి ఉంటే ఈ రోజు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అని తెలిపారు.సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా వెళ్లి ఉంటే ఇండస్ట్రీ ఒక అద్భుతమైన నటిని కోల్పోయేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యాదృచ్ఛికంగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమంత, తన కృషి, ప్రతిభతో దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదగడం నిజంగా గొప్ప విషయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.