నటి సమంతకు కథానాయికగా ఎంత క్రేజ్ ఉందో, ఫ్యాషన్ ప్రపంచంలో కూడా అంత క్రేజుంది. తాజాగా ‘ది నోడ్’ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సమంత ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సమంతలోని సరికొత్త ఎనర్జీని ఆవిష్కరించేలా ఈ ఫొటోలున్నాయి. వీటిలో ఆమె ధరించిన అవుట్‌ఫిట్స్, సామ్ మేకోవర్ డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు. ఇదిలావుంటే.. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ, తన కెరీర్ తొలినాళ్ల ముచ్చట్లను సమంత పంచుకున్నది. ‘నాది ఓ ఊహించని సినిమా ప్రయాణం. అమ్మనాన్నకు మేం ముగ్గురం పిల్లలం. నేను చిన్నదాన్ని. అసలు నటిని కావాలనే ఆలోచనే నాకప్పట్లో లేదు. కాలేజ్ తర్వాత వచ్చిన చిన్న గ్యాప్‌లో సరదాగా మోడలింగ్ వైపు వెళ్లాను. ఈ క్రమంలోనే ఓ సినిమా ఆడిషన్‌కి వెళ్లి హీరోయిన్గా సెలక్టయిపోయాను. ఓ ఏడాది పాటు సినిమాలు చేసి, మళ్లీ కాలేజ్ కెళ్లి చదువుకుందాం అనుకున్నా. కానీ ఈ గ్లామర్ ప్రపంచం నన్నొదల్లేదు’ అంటూ రాసుకొచ్చింది సమంత.