Samantha | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన స్టార్‌డమ్‌ను బాక్సాఫీస్ వద్ద నిరూపిస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుండటంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సమంత తన ఖాతాలో ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది.
ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన అత్యధిక చిత్రాలు కలిగిన హీరోయిన్గా సమంత రికార్డు సృష్టించింది. ఆమె నటించిన మొత్తం 16 సినిమాలు ఈ ఘనతను సాధించాయి. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కూడా అదే జాబితాలో చేరేందుకు సిద్ధమైంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా వీకెండ్ ముగిసే నాటికి సులభంగా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోనుంది. దీంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద 17 మిలియన్ డాలర్ చిత్రాలను కలిగిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్గా సమంత కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకోనుంది.
సమంత కెరీర్లో ఇది మరో కీలక మైలురాయిగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఓవర్సీస్ మార్కెట్లో ఇలాంటి విజయాలను అందుకున్న నటీమణులు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. అందుకే సమంత సాధిస్తున్న ఈ రికార్డును సమీప భవిష్యత్తులో మరెవరైనా అధిగమించడం కష్టమేనని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత కెరీర్ మరోసారి ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. కథా ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సమంత, ఈ సినిమాతో కూడా తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది. సినిమా కలెక్షన్లు ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదు కావడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.