Impure | అమెరికాలో స్థిరపడిన తెలుగు నటి, రచయిత్రి మరియు నిర్మిత వారాహి మల్లిపాముల భారతీయ సినిమా రంగంపై ఉన్న మక్కువతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆమె కథ అందించి, ప్రధాన పాత్రలో నటిస్తూ, తన తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి నిర్మించిన ఇండో-ఇంటర్నేషనల్ చిత్రం ‘ఇంప్యూర్’. నిశాంతి ఇవని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రచార చిత్రాలు మరియు ఇటీవల విడుదలైన ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) సంగీత్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అంతర్జాతీయ గుర్తింపు పొందిన అమెరికన్-తెలుగు ర్యాపర్ మరియు సింగర్ రాజకుమారి ఈ సినిమాతో సంగీత దర్శకురాలిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. బాలీవుడ్ చిత్రం ‘జవాన్’ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ లోని ‘ధోప్’, మరియు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంలో విశేష ప్రజాదరణ పొందిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాటల తర్వాత ఆమె తెలుగులో స్వరపరిచి పాడిన పాట ఈ ‘ఓఎంజీ’. కడలి సత్యనారాయణ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా, రాజకుమారి ఈ చిత్రంలో మరో పాట పాడటంతో పాటు ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కూడా కనిపించనున్నారు.
‘ఇంప్యూర్’ సినిమా నేటి తరం ఆలోచనలకుద్దం పట్టే మోడ్రన్ రిలేషన్షిప్స్ ఆధారంగా తెరకెక్కింది. సమాజంలో మహిళలను చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తూ, విభిన్న తరాల మధ్య ఉండాల్సిన బంధాలు మరియు అనుబంధాల ప్రాముఖ్యతను ఈ కథలో చర్చించారు. ఈ చిత్రం కేవలం జెన్-జీ (Gen-Z) ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల మరియు వయస్సుల వారిని అలరించేలా ఉంటుందని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు. అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వీఎస్ ఛాయాగ్రహణం అందించగా, కరణ్ పాండవ్ మరియు నిర్వాణ్ ఆత్రేయ నేపథ్య సంగీతాన్ని అందించారు.