విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘రణబాలి’ నెవర్ ఫర్ గెట్ ట్రూత్’ పేరుతో రూపొందించిన నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్లో రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్గాట్’ బుధవారం యూట్యూబ్లో స్ట్రీమింగ్కు వచ్చింది.
ఇందులో బ్రిటీషర్స్ ఉద్దేశ్యపూర్వకంగా దాచిన నిజాలు ఏమిటి? రైల్వేల పేరుతో మన దేశపు ధాన్యసిరులను బ్రిటీషర్స్ ఎలా తరలించుకుపోయారో ఈ రెండో ఎపిసోడ్లో చూపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘అప్పట్లో మనకు చరిత్ర అంటే బ్రిటీషర్స్ చెప్పిందే. మనవాళ్ల శ్రమతో బ్రిటీషర్లు వాళ్ల స్వార్థం కోసం నిర్మించుకున్నదే ఇండియన్ రైల్వేస్ అని తెలుసుకున్నా. ట్రిలియన్ డాలర్స్ విలువైన ధాన్యం, పత్తి, మసాలా దినుసులు, బంగారాన్ని ఇండియన్ రైల్వేస్ ద్వారా బ్రిటీషర్స్ తరలించారు’ అని అన్నారు. అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్గాట్’ స్ట్రీమింగ్కు రాబోతున్నది.