అచ్చ తెలంగాణ మాండలికంతో కూడిన టైటిల్‌తో ప్రకటన రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘ఇడుపుకాయితం’. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్నది. వినోదం కలబోసిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘శ్రీలత..’ సాంగ్ ప్రోమో అందరిని ఆకట్టుకుంది. కొత్తగా పెళ్లయిన జంట తాలూకు చిలిపి సరదాలు, అందమైన క్షణాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
‘ఓ శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, ఈ శ్రీనివాసుడే నీ జత’ అంటూ చక్కటి భావాలతో మెప్పించింది. ఈ నేపథ్యంలో పూర్తి పాటను ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సురేశ్ బొబ్బిలి ఈ పాటను స్వరపరిచారు. డిసెంబర్ తొలివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాత: బన్నీ వాస్, రచన-దర్శకత్వం: వంశీ రెడ్డి దొండపాటి.