Nana Patekar | భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. వైద్యుల ప్రకారం.. నానా పటేకర్ తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు వైద్య బృందం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.
నానా పటేకర్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆకస్మిక మరణవార్త బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సాధారణ పాత్రల నుంచి ప్రతినాయకుడి వరకు, భావోద్వేగభరితమైన పాత్రల నుంచి పవర్ఫుల్ క్యారెక్టర్ల వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
‘పరిందా’, ‘ప్రహార్’, ‘అంగార్’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘ఖామోషి’ వంటి చిత్రాలు ఆయన కెరీర్లో ప్రత్యేకమైనవిగా నిలిచాయి. ‘క్రాంతివీర్’లో ఆయన పోషించిన పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ‘పరిందా’, ‘అగ్ని సాక్షి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు జాతీయ అవార్డులు కూడా దక్కాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నానా పటేకర్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు రంగస్థల అనుభవం కూడా ఆయన నటనకు బలమైన పునాదిగా నిలిచింది. పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడిగా నానా పటేకర్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది.
75 ఏళ్ల వయసులోనూ నానా పటేకర్ సినిమాలకు దూరం కాలేదు. ఇటీవల కూడా పలు చిత్రాల్లో కనిపించారు. ‘హౌస్‌ఫుల్ 5’లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులతో కలిసి నటించారు. అలాగే షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి నటించిన విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఓ రోమియో’లో పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’లోనూ ఆయన అతిథి పాత్రలో కనిపించారు.
వయసు పెరుగుతున్నా నానా పటేకర్ తన ఫిట్నెస్ను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఓ వీడియోలో దాదాపు 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించారు. ఆ వీడియో అప్పట్లో అభిమానులను ఆకట్టుకుంది. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చురుకుదనం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన నానా పటేకర్ ఇక లేరన్న వార్త అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నటించిన పాత్రలు, డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన నటనా శైలి భారతీయ సినిమాపై ఆయన వేసిన ముద్రను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.