తొలినాళ్లలో కాస్తంత బొద్దుగా కనిపించిన కీర్తి సురేశ్, ఉన్నట్టుండి బాగా తగ్గింది. తను అనూహ్యంగా బరువు తగ్గి కనిపించడంతో ఆపరేషన్లు గట్రా చేయించుకుందంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడారు. సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. వీటిపై తాజాగా స్పందించింది కీర్తి సురేశ్. ‘ఇప్పటివరకూ నా ఫిట్నెస్ గురించి ఎవరితో మాట్లాడలేదు. మొదట్లో జిమ్ అనేది నాకు సంబంధించింది కాదు, నా శరీరానికి వ్యాయామం అవసరం లేదు అనే ధోరణిలో ఉండేదాన్ని.
కానీ ‘మహానటి’ తర్వాత వచ్చిన గ్యాప్, నా గురించి నేను ఆలోచించుకునే అవకాశాన్నిచ్చింది. వర్కవుట్లు మొదలుపెట్టి కేవలం 9 నెలల్లో పది కేజీలు తగ్గాను. లావుగా ఉంటానంటూ నన్ను బాడీ షేమింగ్ చేసినవారందరికీ సరైన సమాధానం ఇచ్చాను. ఒకప్పుడు జిమ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు జిమ్ చేయకపోతే ఏదోలా ఉంటుంది. ఇది అలవాటుగా మారడం బావుంది. ఒకప్పుడు చీరలోనే అందంగా ఉండేదాన్ని. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సుల్లోనూ ప్రశంసలొస్తున్నాయ్’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్.