అందాల ముద్దుగుమ్మలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకే దొరికిన అవకాశాలకు వెంటనే ఓకే చెబుతున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు చెల్లెలు, కూతుళ్లు పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంటే అది సవాల్‌తో కూడుకున్న విషయమే. కాని కీర్తి సురేష్ మాత్రం అటు రజనీకాంత్, ఇటు చిరంజీవి చెల్లెలుగా నటిస్తూ అందరిని ఆశ్చర్యింపజేస్తుంది.
ఇటీవల విడుదలైన పెద్దన్న చిత్రంలో రజనీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తుంది. చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ 2 కోట్ల పారితోషికం తీసుకుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. పెద్దన్న చిత్రం కోసం కూడా కీర్తి అంతే వసూలు చేసిందట. హీరో చెల్లెలి పాత్ర కోసం స్టార్ హీరోయిన్‌కి సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం కీర్తి సురేష్… మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి పాత్రకు మంచి గుర్తింపు దక్కుతుందని అంటున్నారు. మరోవైపు యువహీరోల సరసన వరుసగా చిత్రాలకు కమిటవుతూ నాయికా ప్రాధాన్య కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కీర్తి.