Sharukh Khan | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కింగ్’ ఒకటి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు కథానాయికగా పరిచయం కానుండటం కూడా ‘కింగ్’పై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. ప్రముఖ నటి కరీనా కపూర్ ‘కింగ్’లో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పాటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీనా కపూర్ ‘కింగ్’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. షారుక్ ఖాన్, కరీనా కపూర్ కాంబినేషన్‌కు ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించి అలరించారు. ఇప్పుడు ‘కింగ్’లో వీరిద్దరూ మరోసారి తెరపై కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రత్యేక పాటను సినిమాలోనే అతిపెద్ద ఆకర్షణల్లో ఒకటిగా నిలిచేలా భారీగా తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌తో పాటు స్టార్ పవర్‌ను కూడా ఉపయోగించుకుని ఈ పాటను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇక షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘కింగ్’ టీమ్ మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నవంబర్ 2న షారుక్ ఖాన్ జన్మదినం సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త ప్రచార కంటెంట్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. షారుక్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండగా.. సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు కరీనా కపూర్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారనే వార్త సినిమాకు మరింత స్టార్‌డమ్‌ను తీసుకొస్తోంది. ‘కింగ్’లో షారుక్, సుహానాతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది