Irumudi | మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్లుగా సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఈ సమయంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ థియేటర్లలో అనూహ్యమైన దూకుడు ప్రదర్శిస్తూ బాక్సాఫీస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందు ఊహించిన దానికంటే సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటుండటంతో టికెట్ కౌంటర్ల వద్ద సందడి రోజురోజుకూ పెరుగుతోంది.సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రివ్యూలు రావడం, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం ‘ఇరుముడి’కి బాగా కలిసొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక భారీగా పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు సమాచారం.
‘ఇరుముడి’ బాక్సాఫీస్ జోరుకు శనివారం బుకింగ్స్ మరో నిదర్శనంగా నిలిచాయి. సినిమా విడుదలైన రెండో రోజు 5.37 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలకు మొదటి రోజు బుకింగ్స్ అత్యధికంగా ఉంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో రెండో రోజు టికెట్ అమ్మకాలు మొదటి రోజు కంటే పెరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రెండో రోజు బుకింగ్ గణాంకాలు ఇటీవల విడుదలైన ‘పెద్ది’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, అలాగే సంక్రాంతి విజేతగా నిలిచిన ‘హనుమాన్’ రెండో రోజు బుకింగ్స్‌ను కూడా అధిగమించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఇరుముడి’ రన్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
‘ఇరుముడి’కి మొదటి రోజు వచ్చిన స్పందన కంటే రెండో రోజు భారీ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరగడం ఈ సినిమా సత్తాని తెలియజేస్తుంది. ఇది కేవలం ఓపెనింగ్ హైప్‌తో వచ్చిన కలెక్షన్లు కాదని, సినిమా చూసిన ప్రేక్షకుల స్పందనతో పాటు పాజిటివ్ టాక్ కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదివారం కూడా బుకింగ్స్ మరింత బలంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కీలక రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొంతకాలంగా వరుస విజయాల కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ రూపంలో భారీ ఊరటనిచ్చే విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన నటనకు మంచి స్పందన వస్తుండటంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.