అతను మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్. ‘బుల్లెట్ సునీల్’గా అందరికి సుపరిచితుడు. 18 ఇండియన్ ఛాంపియన్స్, 57 సౌత్‌జోన్ టైటిల్స్, 100కుపైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అతని సొంతం. అయినా అతడి ప్రయాణం ఆగిపోలేదు. ‘ఇండియన్ రేసర్లంటే ఓడిపోయేవాళ్లే’ అనే అపవాదు అతన్ని స్థిమితంగా ఉండనివ్వ లేదు. రేసింగ్ సర్యూట్‌లో భారతదేశాన్ని సగర్వంగా నిలబెట్టాలని అనుకుంటాడు. మరి అతని ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో తెలుసుకోవాలంటే ‘బైకర్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో సీనియర్ నటుడు రాజశేఖర్ బుల్లెట్ సునీల్‌గా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు.
బుధవారం రాజశేఖర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. బైక్ రేసింగ్ నేపథ్యంలో మూడు తరాల కలల్ని ఆవిష్కరించే కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్, రచన-దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర.