Harish Shankar | మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్లో కీలక దశలో ఉన్నారు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కథ నచ్చితే ఈ కాంబినేషన్ అధికారికంగా సెట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ఎనర్జీకి పేరుగాంచిన ఈ ఇద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలకృష్ణతో ప్రాజెక్ట్ ఆలస్యమైతే, హరీష్ తన పాత హీరోల వైపు మళ్లే అవకాశముంది. ఇప్పటికే ఆయనతో కలిసి పనిచేసిన వరుణ్ తేజ్ లేదా సాయి ధరమ్ తేజ్‌తో మరోసారి సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్లు గతంలో మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో, మరోసారి అదే ఎనర్జీ రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరో వైపు చిరంజీవితో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ వద్ద ఇప్పటికే ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను భారీ తారాగణంతో రూపొందించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హరీష్ శంకర్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మద్దతు ఆయనకు పెద్ద బలం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్ శంకర్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలంటే కచ్చితంగా ఒక ‘ష్యూర్ షాట్ హిట్’ ఇవ్వాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం పాత మాస్ ఫార్ములాపైనే ఆధారపడకుండా, బలమైన కథతో, కొత్తగా ఆలోచించి రావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరి హరీష్ శంకర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది? బాలకృష్ణతోనా లేక తన పాత హీరోలతోనా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది.