అగ్ర నటుడు చిరంజీవి ‘కాకా’ చిత్రం జనవరి 13న సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ, యాక్షన్ అంశాల కలబోతగా పవర్ఫుల్ కథాంశంతో దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో చిరంజీవి కదిరి కాళిదాస్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను షేర్ చేసింది. షూటింగ్‌తో పాటు పోస్ట్ప్రొడక్షన్ను సమాంతరంగా నిర్వహిస్తున్నామని, త్వరితగతిన అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.