Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమా ఒకటి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు దీనిని NBK112గా కూడా ప్రస్తావించారు. అయితే తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పరిణామాలు ఈ సినిమా షెడ్యూల్‌పై కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. అయితే అభిమానుల దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, గతంలో అధికారిక ప్రకటనలో ఉపయోగించిన #NBK112 హ్యాష్‌ట్యాగ్ ఈసారి కనిపించలేదు.
సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి చిన్న మార్పులు కూడా ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తుంటాయి. దీంతో బాలయ్య-కొరటాల సినిమా తాత్కాలికంగా వెనక్కి వెళ్లిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి NBK111 చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. గ్లింప్స్ విడుదలకు ముందు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కొరటాల శివ లేదా యువసుధ ఆర్ట్స్ ప్రతినిధులు బాలయ్యను కలిసిన ఫోటోలు బయటకు రాకపోవడం కూడా NBK112 ఆలస్యంపై ఊహాగానాలకు బలం చేకూర్చింది.
ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, కొరటాల శివ సినిమాకు ముందు బాలకృష్ణ మరో యువ దర్శకుడితో పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు వివేక్ ఆత్రేయ. గత కొంతకాలంగా బాలయ్య-వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌పై వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నట్లు సమాచారం రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్ ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బాలకృష్ణ-కొరటాల శివ సినిమాకు ‘కార్పెంటర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సామాజిక సందేశంతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందే అవకాశం ఉందని సమాచారం. దేవర తర్వాత కొరటాల శివ నుంచి కొత్త సినిమా అధికారికంగా ప్రారంభం కాలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.