Kapil Sharma | బాలీవుడ్ స్టార్ కమెడియన్, ప్రముఖ టెలివిజన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని క్యాప్స్ కేఫ్‌పై మళ్లీ దాడి జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఈ కేఫ్‌పై కాల్పులు జరగగా, తాజాగా జరిగిన ఈ ఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కెనడాలో ఉన్న ఈ కేఫ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కేఫ్ బయటతో పాటు పక్కనే ఉన్న మరో షాప్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలయ్యాయనే విషయం స్పష్టంగా తెలియకపోయినా, అక్కడి ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
ఈ దాడులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ గ్యాంగ్ కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. కేఫ్ ప్రారంభమైన రోజే కాల్పులు జరపడం ద్వారా అల్లకల్లోలం సృష్టించారని, అనంతరం మరో రెండు సార్లు కూడా దాడులు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బుల వసూళ్ల కోసం ఈ గ్యాంగ్ బెదిరింపులు చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
కపిల్ శర్మ కూడా గతంలో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సరైన రీతిలో స్పందన లభించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా జరిగిన కాల్పుల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.ఇక ఈ దాడి తర్వాత సోషల్ మీడియాలో ఒక ఖాతా ద్వారా షాకింగ్ హెచ్చరికలు వెలువడినట్లు తెలుస్తోంది. “ఇప్పటికైనా మా మాట వినకపోతే తదుపరి లక్ష్యం ముంబైలోని కపిల్ శర్మ నివాసం” అంటూ హెచ్చరించినట్లు సమాచారం.ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశాల్లో ఉన్న కపిల్ శర్మ ఆస్తులపై వరుసగా దాడులు జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.