Actress Kangana Ranaut | డీప్‌ఫేక్ సాంకేతికతతో తనపై వస్తున్న అసభ్యకరమైన పోస్టులు మరియు మార్ఫింగ్ చేసిన చిత్రాలపై నటి, మండి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా ఇంటర్నెట్లో ప్రసారం అవుతున్న అశ్లీల కంటెంట్, తన వ్యక్తిత్వ హక్కులను హరించేలా ఉన్న తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వికాస్ మహాజన్ సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ తరహా నకిలీ కంటెంట్ సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి, ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా, ఇదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.
ప్రస్తుతం సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారి జాబితా పెరుగుతోంది. ఇదివరకే అమితాబ్ బచ్చన్ కుటుంబంతో పాటు సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్, ఐశ్వర్య రాయ్ తదితరులు సైతం తమ పేర్లు, ఫొటోలను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయకుండా కోర్టుల ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొందారు. సెలబ్రిటీల ఇమేజ్ను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేసే వారిపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.