Actor Aishwarya Lekshmi | ప్రస్తుత ఆధునిక కాలంలో డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ప్రేమను వెతకడం చాలా సులభం అయిందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ ఎక్కువ ఆప్షన్లే నేడు ప్రేమను మరింత కష్టతరం చేశాయని చెబుతుంది ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన లవ్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆధునిక సంబంధాలు, డేటింగ్ యాప్స్ మరియు మారుతున్న రిలేషన్ అర్థాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పాతకాలంతో పోలిస్తే ప్రస్తుతం సరైన భాగస్వామి కోసం అన్వేషణ చాలా గందరగోళంగా మారిందని ఐశ్వర్య తెలిపారు. అప్పట్లో ఇలాంటి సౌకర్యాలు లేకపోయినా ఒక క్లారిటీ ఉండేదని. కానీ ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్లు ఉండటంతో అసలు ఏ దారిలో వెళ్లాలో తెలియక జనం అయోమయంలో పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, నేటి తరం రిలేషన్‌షిప్‌లలో వస్తున్న సరికొత్త భాష చూసి తాను ఆశ్చర్యపోతుంటానని చమత్కరించారు. సిట్యుయేషన్‌షిప్, నానోషిప్ వంటి వింత పదాలే కాకుండా, తాజాగా ‘బింజింగ్’ అనే పదం గురించి నిన్ననే విన్నానని, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే వినే ఈ పదం ఇప్పుడు ప్రేమ సంబంధాలకు కూడా వర్తిస్తోందని తెలిసి నవ్వుకున్నట్లు చెప్పారు.
ఇక సమయం గడిచే కొద్దీ ప్రేమపై తనకున్న అవగాహన పూర్తిగా మారిపోయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. తెరపై తీవ్రమైన, విషాదాంత ప్రేమ కథల్లో నటించడానికి ఇష్టపడే తను, నిజ జీవితంలో మాత్రం ప్రశాంతమైన, సులభమైన ప్రేమనే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. జీవిత భాగస్వామి ఎంపికలో స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. ‘ప్యార్ దోస్తీ హై’ అనే భావన ఎంత నిజమో తన చుట్టూ ఉన్న విజయవంతమైన వివాహిత జంటలను చూశాక అర్థమైందని, భార్యాభర్తలుగా మారడానికి ముందు వారు మంచి స్నేహితులుగా ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.