అణుబాంబు సృష్టికర్తగా ప్రఖ్యాతిగాంచిన భౌతిక శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోపిక్ ‘ఓపెన్ హైమర్’ చిత్రం ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో ఏడు అవార్డులను గెలుపొంది అగ్ర భాగాన నిలిచింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు పురస్కారాలను ఈ సినిమా దక్కించుకుంది. సృజనాత్మక దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం విశేషం. ‘పూర్ థింగ్స్’ చిత్రం కూడా నాలుగు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం లాస్ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. హాస్య నటుడు జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకొని కోట్లాది భారతీయుల కలను నిజం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అవార్డుల్లో భారతీయ సినిమాలకు నిరాశే ఎదురైంది.
క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పగానే ఇన్సోన్మియా, ది డార్క్ నైట్ , బ్యాట్‌మెన్ బిగిన్స్, టెనెట్, మెమెంటో, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్ వంటి పాపులర్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. సుదీర్ఘ కెరీర్లో సంచలన చిత్రాల్ని అందించిన ఆయన ‘ఓపెన్ హైమర్’ చిత్రంతో తొలిసారి ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం విశేషం. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ చిత్రాలు వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకున్నాయి. అయితే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరిల్లో మాత్రం ‘ఓపెన్ హైమర్’ చిత్రంతోనే తొలిసారి ఆస్కార్ పురస్కారాలను గెలిచారాయన. ‘ఓపెన్ హైమర్’ చిత్రం 13 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపిక కాగా 7 అవార్డులతో సత్తా చాటింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన తొలి బయోపిక్ ‘ఓపెన్ హైమర్’ కావడం విశేషం.
అణుబాంబు పితామహుడిగా అభివర్ణించే ఓపెన్ హైమర్ సంఘర్షణాత్మక జీవితానికి దృశ్యరూపమే ‘ఓపెన్ హైమర్’. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో (1945) అమెరికా ప్రభుత్వం అణుబాంబు పరీక్షకు సిద్ధమవుతుంది. ‘మాన్హాటన్’ పేరుతో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో నిష్ణాతుడైన ఓపెన్ హైమర్‌కు (కిలియాన్ మర్ఫీ) ఆ ప్రాజెక్ట్ బాధ్యతను అప్పగిస్తుంది. ఈ క్రమంలో ఓపెన్ హైమర్ ఎదుర్కొనే సవాళ్లు, జపాన్‌లోని హిరోషిమా-నాగసాకిపై అణుదాడి అనంతరం ఓపెన్ హైమర్‌లో చెలరేగిన మానసిక సంఘర్షణ, అతనిలో కలిగిన పరివర్తన అనే అంశాలతో ఉద్వేగభరితంగా కథ నడుస్తుంది. ‘ఓపెన్ హైమర్’ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాలతో పాటు ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది.
గత ఏడాది జూలైలో ‘ఓపెన్ హైమర్’ చిత్రం భారతదేశంలో విడుదలైంది. అయితే ఈ సినిమాలోని ఓ శృంగార సన్నివేశంలో భగవద్గీత శ్లోకాన్ని చదివి వినిపించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హిందువుల మనోభావాలను కించ పరిచారంటూ పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే సినిమాలోని ఆ సన్నివేశంపై సెన్సార్ బోర్డ్ సైతం ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఇదిలా వుంటే ఓపెన్ హైమర్ జీవితంలో భగవద్గీతకు ఎంతో ప్రాముఖ్యత ఉందనే విషయం ఆయన బయోగ్రఫీని పరిశీలిస్తే అర్థమవుతుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే ఆర్థర్ వై రైడర్ అనే అధ్యాపకుడి ద్వారా ఓపెన్ హైమర్ సంస్కృతాన్ని నేర్చుకున్నారు. భగవద్గీతను ఔపోసన పట్టిన ఓపెన్ హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాల్లో భగవద్గీత ఒకటిగా చెప్పేవారు.
డార్క్ కామెడీ ఇతివృత్తంగా తెరకెక్కిన ‘పూర్ థింగ్స్’ చిత్రంలోని నటనకుగాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ఆమెకిది రెండో ఆస్కార్ పురస్కారం. 2016లో ‘లా లా లాండ్’ చిత్రానికిగాను ఎమ్మాస్టోన్ ఉత్తమ నటిగా తొలిసారి ఆస్కార్‌ను గెలుచుకుంది. స్వీయ అన్వేషణ, స్వేచ్ఛ కోసం ఓ యువతి చేసిన ఖండాంతర ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సైన్స్, ఫాంటసీ అంశాలతో సాగిన ఈ చిత్రంలో ఎమ్మా స్టోన్ చక్కటి నటనను కనబరచింది. ఇక ‘ఓపెన్ హైమర్’ చిత్రంలో టైటిల్ రోల్‌ని పోషించిన కిలియన్ మర్ఫీ తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది డార్క్ నైట్ ట్రయాలజీ, ఇన్సెప్షన్, డన్కిర్క్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు కిలియన్ మర్ఫీ.
ఆస్కార్ అవార్డుల వేడుకలో సంచలనాలు, సరదా సంఘటనలకు కొదువుండదు. ఈ ఏడాది ఆస్కార్ ప్రదానోత్సవంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రెజ్లర్ జాన్ సీనా వేదికపైకి నగ్నంగా వచ్చి ఉత్తమ కాస్ట్యూమ్ అవార్డు విజేతను ప్రకటించడం హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సమయంలో వేదికపై లైట్ల్లు ఆర్పివేశారు. ఆ తర్వాత సహాయకులు వేగంగా వేదికపైకి వచ్చి జాన్‌సీనాకు దుస్తులు అందించారు.
గత ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకొని భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. తాజా అస్కార్ వేడుకల్లో సైతం ఈ పాటను ప్రదర్శించడం విశేషం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ను ప్రకటించే సమయంలో తెరపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని పోరాట ఘట్టాలను కూడా చూపించారు. దీంతో ఆస్కార్ వేడుకల్ని వీక్షిస్తున్న భారతీయ సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ ఏడాది ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో హోలోకాస్ట్ డ్రామా ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి బ్రిటీష్ చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రిటీష్ దర్శకుడు జొనాథన్ గ్లేజర్ రూపొందించిన ఈ చిత్రం కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో నాజీలు చేసిన దురాగతాలకు అద్దం పట్టింది.
ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జానియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20డేస్ ఇన్ మరియా పోల్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: కార్డ్ జెఫర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
ఉత్తమ ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఓపెన్ హైమర్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)