Tata Steel | దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్స్ గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది (2021-22)లో రూ.12,547.70 కోట్ల నికర లాభం గడించినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అధిక ఆదాయం సంపాదించడంతో నికర లాభాలు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం రూ.1,665.07 కోట్ల లాభం గడించింది.
గతేడాది ద్వితీయ త్రైమాసికంలో టాటా స్టీల్స్ మొత్తం ఆదాయం రూ.39,157.79 కోట్లు సంపాదించగా, ఈ ఏడాది అది రూ.60,553.63 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది రూ.37,000.28 కోట్లు ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.47,135.28 కోట్లు ఖర్చయ్యాయి. ఏటా 33 మిలియన్ టన్నుల వార్షిక ముడి ఇనుము సామర్థ్యం గల టాటా స్టీల్స్ ప్రపంచంలోని టాప్ స్టీల్ కంపెనీల్లో ఒకటి.