Tata Punch EV | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చింది. టాటా పంచ్ ఈవీ పేరుతో కొత్త వాహనాన్ని ఇవాళ విడుదల చేసింది. దీని ధర రూ.10.99 లక్షల(ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. స్మార్ట్, అడ్వెంచర్, ఎంవపర్డ్, ఎంపవర్డ్+ అనే నాలుగు వేరియంట్లలో టాటా పంచ్ ఈవీ అందుబాటులో ఉండనుంది. వీటిలో హైఎండ్ మోడల్ అయిన ఎంపవర్డ్+ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నది.
ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి డెలివరీలు మొదలు పెట్టనున్నారు. దగ్గరలోని టాటా షోరూం లేదా టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా టాటా పంచ్ ఈవీ కారును బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.21వేలు టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ కారుకు వస్తున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం నిర్ణయించిన ధరలు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఎనిమిదేండ్ల వ్యారెంటీతో..
టాటా పంచ్ ఈవీ కారులో ఐదు వేరియంట్లు ఉన్నప్పటికీ ప్రధానంగా వీటిని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లుగా విభజించవచ్చు. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ మోడల్స్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 315 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్స్‌లో 35kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ మోడల్స్‌లో 3.3kW సామర్థ్యం గల హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ వస్తుంది. ఈ ఎస్యూవీ కారులో సన్‌రూఫ్, విత్ ఔట్ సన్ రూఫ్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారుకు ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్లు (ఏది ముందు అయితే అది) వ్యారెంటీ ఉంటుంది.
స్పెసిఫికేషన్లు..
టాటా పంచ్ ఐదు వేరియంట్లలోనూ మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్‌వీల్స్ ఉన్నాయి. క్యాబిన్ కూడా విశాలంగా ఉంటుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఏక్యూఐ డిస్ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, యూఎస్బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లు గలవు. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ కారులో భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లను ఇస్తున్నారు. ఎస్‌వోఎస్ కాలింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్
టాటా స్టాండర్డ్ వేరియంట్లో కారుతో పాటు వచ్చే 3.3kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 9.4 గంటల సమయం పడుతుంది. అదే 7.2kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగిస్తే 3.6 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 50kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 56 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
లాంగ్ రేంజ్ వేరియంట్లో అయితే 3.3kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 13.5 గంటల సమయం పడుతుంది. అదే 7.2kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగిస్తే 5 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 50kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 56 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని టాటా మోటార్స్ తెలిపింది.