ముంబై, అక్టోబర్ 8 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశ, విదేశాల్లో సెంట్రల్ బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. దీంతో ఈ ఒక్కరోజే మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయల్లో కరిగిపోయింది. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు లేదా 1.44 శాతం పడిపోయి రెండున్నరేండ్లకుపైగా కనిష్ఠ స్థాయిని తాకుతూ 71,593.24 పాయింట్ల వద్ద నిలిచింది. 2024 ఫిబ్రవరి 13 తర్వాత సూచీ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఒకానొక దశలోనైతే ఇది 1,310.95 పాయింట్లు క్షీణించింది. అలాగే నిఫ్టీ 371.25 పాయింట్లు లేదా 1.64 శాతం కోల్పోయి 21 నెలల కనిష్ఠాన్ని సూచిస్తూ 22,231.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇంట్రా-డేలో 423.15 పాయింట్లు పతనమైంది. దీంతో సూచీ 52 వారాల కనిష్ఠాన్ని చూసింది. బుధవారం సెన్సెక్స్ (429.11 పాయింట్లు), నిఫ్టీ (173.05 పాయింట్లు) నష్టపోయాయి. ఇక భారీ నష్టాలతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.10,01,898.68 కోట్లు హరించుకుపోయింది. దీంతో రూ.4,60,97,032 కోట్ల (4.76 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ 2 శాతం తరిగిపోవడంతో ఈ ఒక్కరోజే రూ.40 వేల కోట్ల మార్కెట్ విలువ కోల్పోయింది. కాగా, ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా సెన్సెక్స్ 13,627.36 పాయింట్లు లేదా 16 శాతం పడిపోయింది. అలాగే నిఫ్టీ 3,897.8 పాయింట్లు లేదా 14.91 శాతం నష్టపోయింది.