ముంబై, అక్టోబర్ 7 : ఊహించినట్టుగానే కీలక వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. పశ్చిమాసియా సంక్షోభంతో విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, దానికితోడు ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న నేపథ్యంలో రెపోరేటును ఆర్బీఐ పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచేందుకే మొగ్గు చూపింది. బుధవారం ముగిసిన మూడు రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 5.50 శాతంగా నిర్ణయించింది. ఇందుకు మొత్తం ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా అంగీకరించింది. మునుపు 5.25 శాతంగానే ఉండేది. ఇక దాదాపు నాలుగేండ్ల తర్వాత ఇదే తొలి పెంపు కావడం గమనార్హం. అంతేగాక ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హయాంలోనూ ఇదే మొదటి వడ్డింపు. మునుపటి గవర్నర్ శక్తికాంత దాస్ హయాంలో 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపోరేటు పెరిగింది. కాగా, సమీప భవిష్యత్తులో వడ్డీరేట్ల కోతలకు అవకాశం లేదన్న సంకేతాలనిచ్చిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం పెరిగినా, రూపాయి మారకం విలువ బాగా పడిపోయినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంకా ఎగబాకినా రెపోరేటును పెంచుతూపోతామని స్పష్టం చేసింది. దీంతో తటస్థ వైఖరి నుంచి క్రమబద్ధమైన కఠిన ద్రవ్య విధానం వైపునకు ఆర్బీఐ మళ్లినట్టు తేలిపోయింది. నిజానికి ఎంపీసీలో ఇద్దరు తటస్థ వైఖరికే మద్దతిచ్చినా మెజారిటీ సభ్యులు (నలుగురు) ఇప్పుడున్న దేశ, విదేశీ ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో కఠిన ద్రవ్య విధానమే ఉత్తమమని భావించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇప్పటికే అమెరికా, జపాన్, ఐరోపా సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఇది కూడా ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపునకు ఒకవిధంగా దారితీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెపోరేటును ఆర్బీఐ పెంచిన నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు కేవలం గంటల వ్యవధిలోనే ప్రకటించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఈ లిస్టులో ఉన్నాయి. పెరిగిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో గృహ, వాహన, వ్యక్తిగత ఇతర రుణాలను కొత్తగా తీసుకునేవారిపై, ఇప్పటికే తీసుకున్నవారిపై వడ్డీల భారం పెరుగుతున్నది. ఫలితంగా ఆయా లోన్ల ఈఎంఐలు పెరిగిపోనున్నాయి.
మరికొన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లూ వడ్డీరేట్లను పెంచే వీలుండటంతో ఈ పండుగ సీజన్లో అమ్మకాలపై ఆర్బీఐ నిర్ణయం ప్రభావం గట్టిగానే కనిపించవచ్చన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండ్లు, వాహనాలు, గృహోపకరణాల విక్రయాలు.. వడ్డీరేట్ల పెంపుతో పడిపోవచ్చన్న ఆందోళనలు రియల్టీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ వార్, ఎల్ నినో, ద్రవ్యోల్బణం దెబ్బకు ఇప్పటికే మార్కెట్లో స్తబ్దత నెలకొన్నదని, వడ్డీరేట్లూ పెరుగుతుండటంతో రుణ లభ్యత కూడా కరువవుతుందని అంటున్నారు. దీంతో వినిమయ/కొనుగోలు సామర్థ్యాలు పడిపోతే దేశ ఆర్థిక ప్రగతికీ ఇబ్బందేనని ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మునుపటి అంచనాతో పోల్చితే 40 బేసిస్ పాయింట్లను పెంచింది. అయినప్పటికీ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ముప్పు లేకపోలేదన్న అభిప్రాయాన్నీ కనబర్చింది. ఇదిలావుంటే రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.2 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ ఈ ద్రవ్య సమీక్ష సందర్భంగా పేర్కొన్నది. మునుపు 5 శాతంగానే అంచనా వేసింది. కాగా, ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో వర్షపాతం దారుణంగా క్షీణించడం, కరువు పరిస్థితులు నెలకొనడం, పంటల సాగు పడిపోయి ఆహారోత్పత్తుల దిగుబడులూ తగ్గిపోతాయన్న అంచనాల మధ్య ద్రవ్యోల్బణం అంచనాను పెంచింది. రాబోయే ద్రవ్య సమీక్షల్లో ఇది మరింత పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి ఎగబాకిన సంగతి విదితమే. కాగా, తదుపరి ద్రవ్య సమీక్ష ఈ ఏడాది డిసెంబర్ 2-4 తేదీల్లో ఉండనున్నది.
రెపోరేటు పెంపు ప్రభావం మీ రుణంపై ఉంటుందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే.. మీ లోన్ ఏ రకం అన్నది ముందుగా తేలాలి. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే స్వల్పకాలిక వడ్డీరేటే ఈ రెపోరేటు. దీంతో రెపోరేటు పెరిగితే బ్యాంక్ రుణాల ఖర్చూ పెరిగిపోతుంది. అందుకే రెపోరేటు పెరిగినప్పుడు బ్యాంకులు తామిచ్చే రుణాలపైనా వడ్డీరేట్లను సహజంగానే పెంచేస్తాయి. అయితే దీనివల్ల అందరు రుణగ్రహీతలూ ప్రభావితమవ్వరు. ప్రస్తుతం ఆయా రుణాలపై వడ్డీరేట్లను ప్రధానంగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లేదా రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్/ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు), ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. మీ రుణం ఈబీఎల్ఆర్ ఆధారంగా ఉన్నైట్టెతే రెపోరేటు సవరింపుల ప్రభావం త్వరగా పడుతుంది. అదే ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఉన్నైట్టెతే సదరు ఎంసీఎల్ఆర్ సవరణలు జరిగినప్పుడే ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు ఆధారంగా లోన్ తీసుకున్నైట్టెతే రుణ కాలపరిమితి మొత్తంగా ఒకే వడ్డీరేటు ఉంటుంది. కాబట్టి రెపోరేటు పెంపు/తగ్గింపు ప్రభావాలేవీ ఇక్కడ ఉండవు. కానీ ఇప్పుడు ఈబీఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలే ఎక్కువ.