Diamond Sector Crisis | సంక్షోభంలో దేశీయ వజ్ర పరిశ్రమ.. మూతపడుతున్న కర్మాగారాలు
దేశీయ వజ్రాల తయారీ రంగం కుదేలైంది. గడిచిన మూడేండ్లుగా ఎగుమతులు-దిగుమతులు భారీగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. దీంతో కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితులు డైమండ్ ఇండస్ట్రీలో రుణ ఎగవేతలకు దారితీస్తున్నాయి.
- భారీగా పడిపోయిన ఎగుమతి-దిగుమతులు
- దూరమవుతున్న ఉద్యోగాలు
Diamond Sector Crisis | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశీయ వజ్రాల తయారీ రంగం కుదేలైంది. గడిచిన మూడేండ్లుగా ఎగుమతులు-దిగుమతులు భారీగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. దీంతో కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితులు డైమండ్ ఇండస్ట్రీలో రుణ ఎగవేతలకు దారితీస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ దూరమైపోతున్నాయని బుధవారం గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) హెచ్చరించింది.
ఇదీ సంగతి..
ల్యాబ్ ఆధారిత వజ్రాల తయారీ పరిశ్రమ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో సహజసిద్ధమైన సానబెట్టని ముడి వజ్రాల నిల్వలు సంప్రదాయ పరిశ్రమల్లో భారీగా పేరుకుపోతున్నాయని, ఆర్డర్లు కూడా వీటికి తగ్గిపోయాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అంటున్నారు. ఫలితంగా ఫ్యాక్టరీలు మూతబడి, ఉద్యోగులు రోడ్డునపడే దుస్థితి నెలకొందని చెప్పారు. భారతీయ డైమండ్ హబ్‌గా పేరొందిన ఒక్క గుజరాత్‌లోనే ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఇండస్ట్రీకి చెందిన 60 మందికిపైగా బలవన్మరణం పొందినట్టు గుర్తుచేశారు. ఇదిప్పుడు దేశీయ వజ్రాల పరిశ్రమ సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు. తక్షణమే ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాలని, అప్పుడే ఈ రంగానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
అరకొర వ్యాపారం
2021-22లో దేశంలోకి ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్ల మేర జరిగాయి. కానీ 2023-24లో ఇవి 14 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అలాగే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి వజ్రాలను ఆయా దేశాలు భారత్‌కు ప్రాసెసింగ్ కోసం తిరిగి ఎగుమతి చేస్తుంటాయి. ఉదాహరణకు బోట్స్వానా, అంగోలా, దక్షిణాఫ్రికా, రష్యాల నుంచి దుబాయ్ ముడి వజ్రాలను దిగుమతి చేసుకుంటున్నది. వాటిని మళ్లీ భారత్‌కు రీ-ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఇలా వస్తున్న వాటి విలువ కూడా 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించింది. మార్కెట్లో పడిపోయిన వ్యాపార లావాదేవీలకు, డైమండ్ ప్రాసెసింగ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. ఇక సానబెట్టిన, పాలీష్డ్ వజ్రాల ఎగుమతి 2021-22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2023-24లో 13.1 బిలియన్ డాలర్లే. కేవలం రెండేండ్లలో 34.6 శాతం పతనం కనిపించింది. అంతేగాక ఈ వ్యవధిలో విదేశాల్లో అమ్ముడుపోక భారత్‌కు తిరిగొచ్చే వజ్రాల వాటా కూడా 35 శాతం నుంచి 45.6 శాతానికి ఎగిసింది.
కీలక మార్కెట్లలో..
అమెరికా, చైనా, ఐరోపా దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా భారతీయ వజ్రాల పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీశాయని ఈ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాలీష్డ్ డైమండ్స్‌కు ఇక్కడ గిరాకీ బాగా తగ్గిందని చెప్తున్నారు. వజ్రాలుసహా ఇతర లగ్జరీ ఉత్పత్తుల కొనుగోళ్లకూ ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదని అంటున్నారు. ముఖ్యంగా ల్యాబ్ (ప్రయోగశాల)ల్లో తయారవుతున్న కృత్రిమ వజ్రాలు తక్కువ ధరకే లభిస్తుండటం కూడా సహజమైన వజ్రాలకు డిమాండ్‌ను తగ్గిస్తున్నది.
- సానబెట్టిన, పాలీష్డ్ వజ్రాల ఎగుమతిదారులకు ఎక్స్పోర్ట్ క్రెడిట్ వ్యవధిని ఆర్బీఐ 6 నెలల నుంచి 12 నెలలకు పెంచాలని వజ్రాల పరిశ్రమ డిమాండ్ చేస్తున్నది.
- దేశీయ వజ్రాల పరిశ్రమలో 7 వేలకుపైగా కంపెనీలున్నాయి. వీటిలో వజ్రాల కటింగ్, పాలీషింగ్, ఎగుమతి కార్యకలాపాలు
జరుగుతున్నాయి. - సూరత్, ముంబైల్లోనే ఎక్కువగా ఈ పరిశ్రమలున్నాయి. వీటిలో చిన్న, మధ్యతరహావే ఎక్కువ. అలాగే కుటుంబ వ్యాపారాలే ఇండస్ట్రీలో అధికం.
- భారతీయ డైమండ్ ఇండస్ట్రీపై 13 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్క సూరత్‌లోనే దాదాపు 8 లక్షలకుపైగా ఉన్నారు.
- లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్, రిటైల్, డైమండ్ టూల్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాలకూ వజ్రాల పరిశ్రమ కీలకంగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

