ముంబై, అక్టోబర్ 10: ఈ పండుగ సీజన్లో గృహ రుణగ్రహీతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ. ఈ నెల 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు గృహ రుణాల వడ్డీరేటుపై 15 బేసిస్ పాయింట్ల నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపునిస్తున్నట్టు తమ వెబ్సైట్లో బ్యాంక్ వెల్లడించింది. దీంతో కనిష్ఠంగా 8.4 శాతం వడ్డీరేటుకే హోం లోన్ లభించే వీలున్నది.
అయితే ఫ్లెక్సీపే, ఎన్నారై, నాన్-సాలరీడ్, ప్రివిలేజ్, శౌర్య, అపాన్ ఘర్ వంటి రెగ్యులర్ హోం లోన్లకే ఈ రాయితీ వర్తిస్తుంది. అలాగే రుణగ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగానే వడ్డీరేట్ల నిర్ణయం ఉంటుందని ఎస్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, ఈ వడ్డీరేట్ల తగ్గింపుల్లో మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్లు.. ప్రివిలేజ్, శౌర్య, అపాన్ ఘర్ లోన్ల కింద ఉద్యోగులకు వచ్చే 5 బేసిస్ పాయింట్ల రాయితీలూ కలిసే ఉన్నట్టు బ్యాంక్ పేర్కొన్నది. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీరేటు 8.55 శాతం నుంచి 9.05 శాతం వరకు ఉన్నది.
సిబిల్ స్కోర్ 700కి దిగువన
సిబిల్ స్కోర్ 650-699కి దిగువన ఉన్నవారికి గృహ రుణాలపై వడ్డీరేటు 8.85 శాతంగా ఉండనున్నది. ఇక 550-649 మధ్య ఉన్నవారికి వడ్డీరేటు 9.05 శాతం. ఎన్టీసీ/నో సిబిల్/-1 ఉన్నవారికి 8.75 శాతం వడ్డీరేటుతో ఎస్బీఐ గృహ రుణాలివ్వనున్నది. టాప్ అప్ లోన్ రేట్ల విషయానికొస్తే.. 800లకుపైగా సిబిల్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు వడ్డీరేటు 8.8 శాతంగా ఉంటుంది. 750-799 సిబిల్ స్కోర్‌పై 8.9 శాతం, 700-749 సిబిల్ స్కోర్‌పై 9 శాతం వడ్డీరేటు ఉంటుంది.
అందరికీ 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు ఉండనున్నది. అలాగే 700 దిగువన సిబిల్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు వడ్డీరేట్లలో ఎటువంటి మార్పుండదు. పాత వడ్డీరేట్లే ఉంటాయి. లోన్ ఎగేనెస్ట్ ప్రాపర్టీ (పీ-ఎల్ఏపీ) విషయానికొస్తే.. 800లకుపైగా సిబిల్ స్కోర్ ఉన్నవారికి 10 శాతంగా, 750-799 సిబిల్ స్కోర్‌పై 10.1 శాతం, 700-749 సిబిల్ స్కోర్‌పై 10.2 శాతం వడ్డీరేటు ఉంటుంది. అందరికీ 30 బేసిస్ పాయింట్లదాకా రాయితీ లభిస్తుంది. 700 దిగువన సిబిల్ స్కోర్ ఉంటే వడ్డీరేట్లు యథాతథంగానే ఉంటాయి. ఇదిలావుంటే రెగ్యులర్ హోం లోన్లు, టాప్ అప్ లోన్లకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులుండవని ఎస్బీఐ తెలిపింది. అయితే పీ-ఎల్ఏపీ తదితర రుణాలపై రూ.10,000 (జీఎస్టీ అదనం) ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది.